స్పీకర్ తమ్మినేని అంత పెద్ద తప్పు చేశారా?

Fri Mar 24 2023 12:14:10 GMT+0530 (India Standard Time)

AP Speaker Tammineni Sitaram

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారాం మీద సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా నన్నూరి నర్సిరెడ్డి. డిగ్రీను మధ్యలోనే ఆపేశారని ఆయన ఆరోపించారు. డిగ్రీ పూర్తి చేయకుండానే మూడేళ్ల లా కోర్సును అక్రమంగా చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన నన్నూరి.. స్పీకర్ తమ్మినేని విద్యార్హత మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘డిగ్రీ మధ్యలోనే ఆపేసినట్లుగా తమ్మినేని స్వయంగా చెప్పారన్నారు. మరి.. డిగ్రీ అర్హత లేకుండా లా కోర్టులో ఆయన ఎలా చేరారు? ఏఅర్హతతో చేరారు? రాజ్యాంగబద్ధమైన పదవిలో ున్న ఆయనకు ఉస్మానియా వర్సిటీ అధికారులు ఏమైనా మినహాయింపులు ఇచ్చారా? ఇప్పటికైనా ఆయన తనకున్న అసలైన అర్హత ఏమిటో బయటపెట్టాలి’’ అంటూ సవాలు విసిరారు.

నిబంధనల ప్రకారం చూసినప్పుడు ఐదేళ్ల లా కోర్సు చేయటానికి ఇంటర్ విద్యార్హత సరిపోతుంది. కానీ..మూడేళ్ల లా డిగ్రీ చేయాలంటే మాత్రంకచ్ఛితంగా డిగ్రీ ఉండాల్సిందే. లేదంటే.. డిగ్రీ సమానమైన కోర్సును చేసి ఉండాలని నిబంధనలు చెబుతున్నాయని.. కానీ.. తమ్మినేని డిగ్రీని మధ్యలోనే ఆపేశారన్నారు. మరి..ఆయనకు ఉస్మానియా అధికారులు ప్రత్యేకమైన మినహాయింపులు ఏమైనా ఇచ్చారా? అంటూ ప్రశ్నించిన నన్నూరి.. నీతి చంద్రికలు వల్లించే తమ్మినేనికి ఇదెలా సాధ్యం? అంటూ ప్రశ్నించారు. తమ్మినేని డిగ్రీ మధ్యలో ఆపేసి.. లా కోర్టు చేయటాన్ని తప్పు పడుతూ.. దీనిపై న్యాయ విచారణ చేయాలని కోరటం గమనార్హం. మరి.. దీనికి ఏపీ స్పీకర్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.