Begin typing your search above and press return to search.

ఏపీలో స్మార్ట్ మీటర్ల షాక్ షురూ.. ఎవరి మీద ఎంత భారమంటే?

By:  Tupaki Desk   |   21 March 2023 9:30 PM IST
ఏపీలో స్మార్ట్ మీటర్ల షాక్ షురూ.. ఎవరి మీద ఎంత భారమంటే?
X
ఏపీలోని పలువురు విద్యుత్ వినియోగదారులకు కొత్త బాదుడు వ్యవహారం మొదలైంది. దీనికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓకే చెప్పినట్లుగా సమాచారం. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు.. నెలకు 200 యూనిట్లు పైబడి వినియోగించే గృహవిద్యుత్‌ వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లను బిగించేందుకు వీలుగా డిస్కమ్ లు సిద్ధమయ్యాయి. ఈ మీటరలను బిగించే బాధ్యతను కడప జిల్లాకు చెందిన షిర్డీ సాయి.. అదానీ సంస్థలకు అప్పజెప్పనున్నారు.

ఈ మీటర్లకు అయ్యే వ్యయాన్ని ప్రజల నుంచే వసూలు చేయాలని జగన్ సర్కారు డిసైడ్ అయ్యింది. ఈ మీటర్లకు అయ్యే ఖర్చును 93 నెలల పాటు.. అంటే ఏడేళ్ల తొమ్మిది నెలల పాటు నెలకు రూ.130చొప్పున వసూలు చేస్తారు.

వ్యవసాయ వినియోగదారుల బిల్లులను మాత్రం ప్రభుత్వం భరిస్తుందని డిస్కమ్ లు చెబుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఈ రీతిలో బిగించే స్మార్ట్ మీటర్లు దాదాపు 45 లక్షలకు పైగా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయనున్నారు.

ఇందులో 18.57 లక్షల వ్యవసాయ విద్యుత్ మీటర్లను.. పట్టణ ప్రాంతాల్లో 200 యూనిట్లకు పైబడి వాడే 27.26 లక్షల ఇళ్లు.. పరిశ్రమలకు సంబంధించి స్మార్ట్ మీటర్లను బిగించనున్నారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ జరిగినా.. ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు? ఎంతకు కోట్ చేశారన్న ప్రాధమిక సమాచారం బయటకు రాలేదు. మొత్తం మూడు సంస్థలు కలిపి రూ.2201.29 కోట్ల స్మార్ట్ మీటర్ల కోసం టెండర్లు పిలవగా పలు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి.

ఇందులో ఏం జరిగిందన్నది బయటకు రాలేదు కానీ.. చివర్లో మాత్రం వ్యవసాయ పంపు సెట్లకు షిర్డీసాయి.. పారిశ్రామిక, గృహ విద్యుత్‌ వినియోగదారులకు మీటర్ల బిగింపును అదానీకి అప్పగించేందుకు వీలుగా ఒప్పందాన్ని ఓకే చేశారు.

అయితే.. స్మార్ట్ మీటర్ల పేరుతో వినియోగదారుల మీద భారం మోపే కార్యక్రమానికి ఏపీ సర్కారు శ్రీకారం చుట్టిందని చెప్పాలి. సంక్షేమ పథకాలకు బటన్ నొక్కే కార్యక్రమాన్ని చేపట్టే సీఎం జగన్.. ఈ స్మార్ట్ మీటర్ల భారాన్ని మోయకుండా ప్రజలకు బదిలీ చేయటం ఆసక్తికరంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.