Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేలను ఎందుకు గెలిపించాలి...?

By:  Tupaki Desk   |   7 Jun 2023 7:00 PM GMT
వైసీపీ ఎమ్మెల్యేలను ఎందుకు గెలిపించాలి...?
X
అవును వైసీపీ ఎమ్మెల్యేలను ఎందుకు గెలిపించాలి. ఈ ప్రశ్న ప్రజలు వేసుకుంటే ఎలా ఉంటుంది. దీని మీదనే ఇపుడు చర్చ సాగుతోంది. నాలుగేళ్ళ పాటు అధికారంలో ఉన్నారు. మరి ఏమైనా చేశారా అంటే లేదు అన్న జవాబు వస్తుంది. కానీ వారినే మళ్ళీ గెలిపించాలని వైసీపీ అధినాయకత్వం చెబుతోంది. వారిని ప్రతీ గడపకు పంపిస్తోంది.

అయితే వైసీపీ ఎమ్మెల్యేలను జనాలు గెలిపించేది ఈసారి జగన్ ఫేస్ చూసి కాదు, వారి పెర్ఫార్మెన్స్ చూసి మాత్రమే అని అంతా అంటున్నారు. అందువల్ల నాలుగేళ్ల కాలంలో తమ ప్రాంతానికి వారు ఏమి అభివృద్ధి చేశారు అన్నది వారు కచ్చితంగా చూస్తారు అన్నీ ఆలోచిస్తారు అని అంటున్నారు.

అదే విధంగా తీసుకుంటే సంక్షేమ పధకాలు అన్నవి వారి చేతిలో లేవు. వారు ఎవరికి అయినా ఇవ్వాలనుకుంటే ఇవ్వలేరు. కాబట్టి అది వారి వల్ల అయ్యేది కాదు అని అంటున్నారు. మరో మాటగా చెప్పుకుంటే స్థానిక సంస్థల నుంచి ప్రజా ప్రతినిధులుగా గెలిచిన వారి చేతిలో పెన్షన్లు ఇప్పించే అవకాశం ఉందా అంటే అది కూడా లేదు అని అంటున్నారు.

ఇక మౌలిక సదుపాయాల కల్పనలో నాలుగేళ్ళుగా ఎమ్మెల్యేలు ఏమీ చేసింది లేదు అన్నది జనాలలో బలంగా ఉన్న భావన. కనీసం రోడ్లను కూడా వేయలేకపోయారు అని అంటున్నారు. ఇక తన నియోజకవర్గంలో అయినా వారు చొరవ తీసుకుని ఏమైనా కంపెనీలు వచ్చేలా చూసి జాబ్స్ అయినా స్థానిక యువతకు ఇప్పించారా అంటే అదీ లేదు అని అంటున్నారు.

ఇక స్థానిక నియోజకవర్గాలలో చెరువులు కూడా ఏమీ బాగులేవని అంటున్నరు. ఏదో అభిమానం కొద్దీ కాంట్రాక్టర్లు చొరవ తీసుకుని ఎన్నో కొన్ని అభివృద్ధి పనులు చేస్తే పోనీ వాటికి అయినా బిల్లులు ఇప్పించారా అంటే అదీ లేదు అని అంటున్నారు. సరే ఇవన్నీ చేయలేదు అనుకున్నా వారు ప్రజలకు కనిపిస్తూ వారికి ఏమైనా చేస్తామం, మేము అండంగా ఉన్నామని చెబుతున్నారా అంటే అదే లేదు అని అంటున్నారు.

అంటే ఏ విధంగా చూసుకున్నా వైసీపీ ఎమ్మెల్యేల మీద ఏమీ చేయలేదు అన్న బలమైన విమర్శలు మాత్రం ఉన్నాయి. దాంతో వారి విషయంలో ఎందుకు ఆలోచించాలి ఎందుకు ఓటు వేయాలి అన్న చర్చ అయితే మొదలైంది అని అంటున్నారు. ఎమ్మెల్యేలు ఒకప్పుడు తమను తాము ప్రూవ్ చేసుకుంటూ మొత్తం నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉండేవారు ఇపుడు చూస్తే ఎవరికి వారుగా సొంత వ్యాపారాలు చేసుకుంటూ తమకు అవసరం అయినపుడు మాత్రమే జనాల వద్దకు వస్తున్నారు అన్న ఒక అభిప్రాయం కచ్చితంగా జనాల్లో పేరుకు పోయింది.

అందుకే గడప గడప పేరుతో చాలా మంది వస్తున్నా జనాలు మాత్రం పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు అని అంటున్నారు. వాళ్ళు వాళ్ళ అవసరాల కోసమే వస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదన్న భావం కూడా బలపడిపోతోంది. దాంతో ఎమ్మెల్యేలతో చాలా చోట్ల స్థానిక సమస్యల మీద జనాలు గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి. అవి వైరల్ గా కూడా అవుతున్నాయి.

దీంతో వైసీపీ ఎమ్మెల్యేల మీద జనంలో అసంతృప్తి ఉందని ఏ సర్వే చేయకుండానే బయటపడుతోంది. ఎమ్మెల్యేలు తన ప్రాంతానికి ఎన్నో హామీలు ఇచ్చారు. అలా కనుక చూసుకుంటే వారికంటూ ఒక మ్యానిఫేస్టో ఉంది. దాన్ని నాలుగేళ్ళ కాలంలో పూర్తి చేశారా అంటే జవాబు అయితే రావడంలేదు. హామీలు ఇచ్చేశాం, అంతే అన్నట్లుగా చాలా మంది ఎమ్మెల్యేల తీరు ఉందని అంటున్నారు.

దీంతోనే ప్రజలలో ఆగ్రహం బాగా ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా వైసీపీ ఎమ్మెల్యేలను ఎందుకు ఎన్నుకోవాలని ఒక్క మాటకు జవాబు చెప్పమని ప్రజలు అడుగుతున్నారు. మరి దీనికి సమాధానం ఉన్న వారే మళ్లీ ఓటు తీసుకునేది అని కూడా అంటున్నారు. చూడాలి మరి ప్రజలకి ప్రశ్నల జవాబు చెప్పే వారు ఎంతమంది ఉంటారో.