జగన్‌కు ఏపీ ఎన్జీవోల బెదిరింపులు..!

Sun Dec 05 2021 23:00:01 GMT+0530 (IST)

AP NGOs threaten Jagan

ఏపీలో ఉద్యోగ సంఘాల నాయకుల తీరు చాలా చిత్ర విచిత్రంగా ఉంది. వీరు నిజంగా ఉద్యోగుల బాగోగుల కోసం పని చేస్తున్నారా ? తమ వ్యక్తిగత స్వార్థ అవసరాల కోసం నాయకుల అవతారం ఎత్తారా ? అన్నది తెలియడం లేదు. అశోక్‌బాబు ఉద్యోగ సంఘాల నేతగా ఎదిగి.. ఎంచక్కా టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయన వారసుడిగా ఉన్న నేత వైసీపీ కాంగ్రెస్‌కు ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలపై సలహాదారుగా ఉన్నారు. ఏదేమైనా పీఆర్సీ ప్రకటన ఆలస్యం కావచ్చు.. ఇతర కారణాలు కావచ్చు.. ఉద్యోగులు ప్రభుత్వంపై అసహనంతో ఉన్నారు. తాజాగా ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఉద్యోగులు అంటే ప్రభుత్వానికి లెక్కే లేదని... రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని... ఒక్కో ఉద్యోగి చేతిలో కనీసం ఐదు ఓట్లు ( భార్య భర్త తల్లిదండ్రులు ఒక పిల్ల లెక్క) ఉంటాయని.. అంటే 60 లక్షలు ఓట్లు ఉద్యోగులు ప్రభావితం చేస్తారని.. వీరి దెబ్బేంటో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు బాగా అర్థమైందంటూ పరోక్షంగా జగన్‌పై విమర్శలు గుప్పించారు. తమను ఇబ్బంది పెడుతోన్న జగన్ ప్రభుత్వాన్ని ఈ ఉద్యోగులే కూల్చివేస్తారన్న విషయం ఆయన అర్థం చేసుకోవాలంటూ బండి హెచ్చరిక ధోరణితో మాట్లాడారు.

జీతాలు సరైన టైంకు అందక రాష్ట్ర ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆయన ఫైర్ అయ్యారు. ప్రతి నెలా పింఛన్లు కూడా ఆలస్యం అవుతుండడంతో వారి బాధలు కూడా వర్ణనాతీతంగా ఉన్నాయంటూ బండి శ్రీనివాసరావు చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు ఓ రేంజ్‌లో వైరల్ చేస్తున్నారు. అలాగే రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ వర్సిటీ హెల్త్ సెన్సెస్ వైస్ ఛాన్సెలర్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఉద్యోగుల బెదిరింపులు జగన్ సర్కార్‌ను తాకేనా..?
ఉద్యోగ సంఘాలు ఆ సంఘాల నేతల బెదిరింపులు తాటాకు చప్పుళ్లకు జగన్ అదిరి బెదిరే సూచనలు ఎంత మాత్రం కనపడడం లేదు. జగన్ ఏ విషయంలో అయినా తాను చేయాలనుకున్నదే చేస్తారు. జగన్ ముందు నుంచి కూడా సంక్షేమం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయిందని డిసైడ్ అయిపోయారు. అందుకే సొంత పార్టీ నేతల విషయంలో కూడా ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు. మరి వీరిని మాత్రం ఎందుకు పట్టించుకుంటారు ?  వీరి డైలాగులకు నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే సీన్ ఉంటుందా ? అన్నదే పెద్ద ప్రశ్న ?