Begin typing your search above and press return to search.

ఎస్సీ ఎమ్మెల్యేలను ఈ విధం గా అవమానిస్తారా ?

By:  Tupaki Desk   |   28 May 2023 3:00 PM GMT
ఎస్సీ ఎమ్మెల్యేలను  ఈ విధం గా అవమానిస్తారా ?
X
ఎస్సీ నాయ‌కుడు, ఏపీ డిప్యూటీ సీఎం, జ‌గ‌న్ కేబినెట్‌లో వ‌రుస‌గా రెండో సారి కూడా అవ‌కాశం ద‌క్కిం చుకున్న కిళ‌త్తూరు నారాయ‌ణ స్వామి తాజాగా ఫైర్ అయ్యారు.త‌ర‌చుగా రెడ్డి సామాజిక‌వ‌ర్గం పై విరుచుకు ప‌డే ఆయ‌న‌.. మ‌ళ్లీ అదే రెడ్డి వర్గానికి చెందిన మంత్రుల‌ కు కాళ్లు మొక్క‌డం తెలిసిందే. ఇక‌, తాజాగా ఆయ‌న గ‌డ‌ప గ‌డ‌ప‌ కు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అయితే.. ఆయ‌న వ‌స్తున్నార‌ని తెలిసి.. గ్రామ‌స్థులు ఇళ్ల‌కు తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన నారాయ‌ణ స్వామి.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఏం జ‌రిగిందంటే..

ఉప‌ ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామి శ‌నివారం సాయంత్రం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం గంగాధ‌ర నెల్లూరు లో గ‌డ‌ప గ‌డ‌ప‌ కు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ పాచిగుంట గ్రామానికి వెళ్లారు. అయితే అక్కడ డిప్యూటీ సీఎం కు తాళాలు వేసిన ఇల్లు దర్శనమిచ్చాయి. నారాయణ స్వామి వస్తున్న విషయం తెలుసుకొని ఇళ్ల కు తాళాలు వేసి జనం వెళ్లిపోయారు. ఊరంతా ఖాళీ అవ్వడంతో మంత్రి వ‌ర్యులు అసహనానికి గురయ్యారు. సర్పంచ్ తో పాటు గ్రామంలో ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ క్ర‌మంలో నారాయ‌ణ స్వామి తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. ఎస్సీ ఎమ్మెల్యేలు వస్తున్నారని ముందుగానే తెలుసుకుని కావాలనే కొందరు తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా ఇళ్ల కు తాళాలు వేయించడం వెనుక చంద్రబాబు హ‌స్తం ఉంద‌ని ఆయ‌న ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన సామాజికవర్గం వాళ్ల కు చెప్పి ఇళ్లకు తాళాలు వేయించి ఎస్సీ ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని నిప్పులు చెరిగారు.

తనకే కాదు.. జిల్లాలో మరికొందరు ఎస్సీ ఎమ్మెల్యేల కు ఇదే విధంగా అవమానాలు ఎదురైనా.. వైసీపీ ముఖ్య నేతలు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వైసీపీ నేతల వైఖరి మా దురదృష్టం, దౌర్భాగ్యం. ఎస్సీ ఎమ్మెల్యేలు వెళితే ఇళ్ల కు తాళాలు వేయడం చంద్రబాబు పనే. నాకు ఇతర ఎస్సీ ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం పై.. వైసీపీ ముఖ్య నేతలు స్పందించడం లేదు' అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఆయ‌న వ్యాఖ్య‌లు.. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డి ని ఉద్దేశించిన‌వేన‌ని అంటున్నారు స్థానిక వైసీపీ కేడ‌ర్‌.