Begin typing your search above and press return to search.

మూడిళ్ళ పూజారిగా మారిన వైసీపీ మంత్రిగారు?

By:  Tupaki Desk   |   30 Jan 2023 6:00 AM GMT
మూడిళ్ళ పూజారిగా మారిన వైసీపీ మంత్రిగారు?
X
ఆయన డైనమిక్ మినిస్టర్ అని అంటారు. జగన్ మీద ఈగ వాలితే అసలు సహించరు. జగన్ కి వెన్నంటి ఉంటారు. జగన్ని ఎవరేమన్నా ఇట్టే విరుచుకుపడిపోతారు. మాటలతో దాడి చేస్తారు. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమరనాధ్. ఆయన అనకాపల్లి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరు అన్నది కచ్చితమైన వార్తా సమాచారం. దానికి అనేక కారణాలు ఉన్నాయి.

ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఆయనకు అక్కడ టికెట్ ఇవ్వరని అంటున్నారు. నాన్ లోకల్ కార్డుతో సొంత పార్టీ వారే ఆయన్ని పక్కన పెడుతున్నారు. దాంతో గుడివాడకు వేరే చోటకు షిఫ్ట్ కావాల్సి వస్తోంది. మరి ఆ సేఫెస్ట్ ప్లేస్ ఏది అంటే ఆయన మూడు నియోజకవర్గాలలో జెండా పాతాలనుకుంటున్నారు. చివరికి అందులో ఏది తనకు బెస్ట్ అవుతుందో చూసి మారీ పోటీ చేయాలని అనుకుంటున్నారుట.

దాంతో ఆయన ఎలమంచిలిలో పాగా వేస్తున్నారు. అక్కడ సొంత పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన. కన్నబాబు రాజు తనకు కానీ తన కుమారుడికి కానీ టికెట్ తెచ్చుకుందామని చూస్తున్నారు. ఆయనకు అక్కడ గట్టి పట్టుంది. అలాంటి కన్నబాబు రాజుని కదపాలని గుడివాడ చూస్తున్నారు.  ఎలమంచిలిలో కాపుల జమాభా ఎక్కువ. దాంతో ఆయన తన సొంత సామాజికవర్గం నేతలను చేరదీసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా  చేయాల్సింది అంతా చేస్తున్నారు.

వారే ఎమ్మెల్యే గడపగడపకు వస్తే అడ్డుకుంటున్నారు. మా దగ్గరకు రావద్దు అని కొన్ని కాలనీలలో అలా రెచ్చగొట్టి మరీ సొంత  ఎమ్మెల్యేనే గుడివాడ అనుచరులు బ్యాడ్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇక దీని మీద రాజు గారు మండిపోతున్నారు. నాన్ లోకల్ కి టికెట్ ఇస్తే వైసీపీ ఓడిపోవడం ఖాయమని ఆయన అపుడే స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి ఈ కధ ఇలా సాగుతూండగానే మరో చోట కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేకు చిచ్చు పెట్టేశారు అని అంటున్నారు.

ఆ సీటే పెందుర్తి. అక్కడ ఉన్నది అదీప్ రాజు. యువకుడు అయిన అదీప్ రాజుకు ఇది ఫస్ట్ టైం ఎమ్మెల్యే సీటు. ఆయన మరోసారి సీటు కోరుకుంటున్నారు. అయితే అక్కడ కూడా గుడివాడ తన అనుచర వర్గంతో ఎమ్మెల్యేకు పొగ పెట్టేస్తున్నారు. తన అనుచరులను సొంత పార్టీ ఎమ్మెల్యే మీద ఉసి గొలుపుతున్నారని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. దీంతో తట్టుకోలేక సదరు ఎమ్మెల్యే గారు పార్టీ అధినాయకత్వానికి తన గోడు చెప్పుకున్నారు అని అంటున్నారు.

ఇక గాజువాక సీటు మీద కన్నేసిన గుడివాడ అక్కడ నుంచి పోటీకి తయార్ అంటున్నారు. అయితే అక్కడ తిప్పల ఫ్యామిలీ గట్టిగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే చాలా మంది రేసులో ఉన్నారు. మరి అక్కడ మంత్రి గుడివాడ వస్తే ఎలా రియాక్షన్ వస్తుందో తెలియదు కానీ మంత్రి గారు అక్కడ కూడా తన అనుచరులను దువ్వుతున్నారు. ఇలా మూడు చోట్లా తన వారిని పెట్టి సొంత పార్టీలోనే ఆయన కుంపట్లు రాజేస్తున్నారు అని వైసీపీలో వాపోతున్నారు.

మరో వైపు అధినాయకత్వం అయితే గుడివాడను తొందరగా ఏదో ఒక సీటు చూసుకోమని చెప్పిందని టాక్. దాంతో సర్వేల మీద సర్వేలు ఈ మూడు చోట్ల చేయించుకుంటున్నారు అని తెలుస్తోంది. మరి సర్వే నివేదికలు ఏమి చెబుతున్నాయో తెలియదు కానీ గుడివాడ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.

ఆయన పోటీ మాట పక్కన పెడితే సొంత పార్టీ వారినే డ్యామేజ్ చేసి పారేస్తే వారు వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారు అన్న ప్రశ్నలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. మొత్తానికి మంత్రి గారు మూడిళ్ళ పూజారిగా మారి మూడు నియోజకవర్గాలలో సుడిగాలి టూర్లు వేస్తున్నారు అని అంటున్నారు. జగన్ కి సన్నిహితుడైన మంత్రిగా ఉండడంతో ఆయన హవా అలా సాగుతోంది అని అంటున్నారు.