జడ్జిలపై వ్యాఖ్యలు.. లైట్ తీసుకున్న సోషల్ మీడియా.. హైకోర్టు ఫైర్

Thu Jan 27 2022 05:00:01 GMT+0530 (IST)

AP Highcourt Fires AP Govt

ఏపీలో వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో గతంలో వైసీపీకి చెందిన సానుభూతి పరులు ఆ పార్టీ నేతలు.. ఎంపీ కూడా.. కోర్టులపైనా.. న్యాయవ్యవస్థపైనా.. జడ్జిలపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడం.. అవి కోర్టు వరకు చేరడం తెలిసిందే. తొలుత సీఐడీ ఈ కేసులను విచారించింది. అయితే.. ఇది ముందుకు సాగడం లేదని గ్రహించిన కోర్టు.. తర్వాత ఈ కేసులను సీబీఐకి అప్పగించింది. అయితే.. సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత.. కొంతమందిని అరెస్టు చేసినా.. సోషల్ మీడియాల్లో ఆయా పోస్టులను తొలగించడంలో మాత్రం విఫలమైంది.ఈ నేపథ్యంలోనే జడ్డీలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఉన్న పోస్టులు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సోషల్ మీడియాలో జడ్డీలకు న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులు తొలగించాలని ట్విట్టర్ యూట్యూబ్ ఫేస్ బుక్ లకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసుల్ని ఆయా సంస్ధలు లైట్ తీసుకున్నాయి. నామమాత్రంగా పోస్టులు తొలగించి మిగతా వాటిని వదిలేశాయి. దీంతో ఈ వ్యవహారం మరో వివాదానికి దారి తీస్తోంది.

హైకోర్టు ఆదేశాల ప్రకారం సీబీఐ ఇచ్చిన నోటీసుల్ని సైతం సోషల్ మీడియా సంస్ధలు లైట్ తీసుకోవడం వెనుక ఉన్న కారణాలపై చర్చ మొదలైంది. అయితే సోషల్ మీడియా సంస్ధలు ఇందుకు గల కారణాల్ని వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాను కట్టడి చేసే క్రమంలో గతేడాది ఐటీ చట్టంలో మార్పులు చేసింది. వీటి ప్రకారం సోషల్ మీడియా సంస్ధలు కొన్ని సంస్ధలు ప్రభుత్వాలు కోర్టుల ఆదేశాల ప్రకారమే వివాదాస్పద పోస్టుల్ని తొలగించాల్సి ఉంటుంది.

ఇందులో కోర్టు ఆదేశాలు ఉంటే కేంద్రం నోటిఫై చేసిన సంస్ధల ఆదేశాలు ఉంటేనే వీడియోలు తొలగిస్తామని చెప్పేశాయి. ఈ జాబితాలో సీబీఐ లేదని హైకోర్టుకు తెలిపాయి. దీంతో హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తాము నేరుగా ఆదేశాలు ఇచ్చినా సోషల్ మీడియా సంస్ధలు పట్టించుకోకపోవడంపై  విచారణ జరిపింది. సోషల్ మీడియా సంస్ధలు తాము ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

తమ ఆదేశాల మేరకే సీబీఐ నోటీసులు జారీ చేసినా సోషల్ మీడియా నుంచి జడ్డీలకు వ్యతిరేక వీడియో లు పోస్టులు తొలగించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. తమ ఆదేశాల్ని సరైన స్ఫూర్తితో అమలు చేయడం లేదని సీరియస్ అయింది. జడ్డీలకు వ్యతిరేక పోస్టులపై రిజిస్ట్రార్ జనరల్ తో పాటు సీబీఐ వివరాలు ఇచ్చినా తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సోషల్ మీడియా సంస్ధలు ఇరుకునపడ్డాయి. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వివరాలు ఇచ్చినా ఆయా సంస్ధలు వాటిని తొలగించడం లేదని సీబీఐ ఆరోపించింది.

దీంతో తొలగించామని సోషల్ సంస్ధలు హైకోర్టుకు తెలిపాయి. ఈ భిన్న వాదనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పోస్టుల తొలగింపులో హైకోర్టుకు ఎవరు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. సీబీఐతో పాటు సోషల్ మీడియా సంస్ధలపై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది. ఇప్పటివరకూ సీబీఐ ఇచ్చిన సోషల్ పోస్టుల వివరాలు వాటిని తొలగించేందుకు సోషల్ సంస్ధలు తీసుకున్న చర్యల వివరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరి ఇది ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.