మంచి తరుణం మించినా దొరకదు.. ఆ నియోజకవర్గంలో టీడీపీ నేతలకు బంఫర్ చాన్స్!

Sat Aug 13 2022 11:03:54 GMT+0530 (IST)

AP Heates Politics Between TDP and YSRCP

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించడమే లక్ష్యంగా అధికార ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీ 175కి 175 స్థానాలను గెలవాలని ఈసారి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల్లో ముఖ్య నేతలందరినీ ఓడించడానికి ఇప్పటి నుంచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని వార్తలు వస్తున్నాయి.ఈసారి ఎలాగైనా చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని ఓడించాలని వైఎస్సార్సీపీ సర్వశక్తులూ కేంద్రీకరిస్తోంది. అక్కడ టీడీపీ నేతలపై సామదాన దండోపాయాలు ప్రయోగించి.. కొంతమందికి తాయిలాలు ప్రకటించి.. అభివృద్ధి పేరుతో నిధుల వరద పారించి టీడీపీ నేతలను తమ పార్టీలోకి లాక్కొంటోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడి కుమారుడు ఎమ్మెల్సీ నారా లోకేష్ పోటీ చేయనున్న గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ వైఎస్సార్సీపీ ఇలాంటి సామదాన భేద దండోపాయాలకు దిగిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ముఖ్య నేతగా ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి రాజీనామా చేశారు. ఆయన ఇంకా ఏ పార్టీలో చేరనప్పటికీ ఆయన రాజీనామా వెనుక ఉంది వైఎస్సార్సీపీయేనని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

గత ఎన్నికల్లో ఓడించినట్టే వచ్చే ఎన్నికల్లోనూ నారా లోకేష్ ను ఎలాగైనా ఓడించాలని వైఎస్సార్సీపీ కంకణం కట్టుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పరోక్షంగా వెనుక ఉండి గంజి చిరంజీవితో రాజీనామా చేయించినట్టే మిగతా టీడీపీ నేతలతోనూ ఆ పార్టీకి రాజీనామాలు చేయించే యోచనలో వైఎస్సార్సీపీ ఉందని చెబుతున్నారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ముఖ్య నేతలుగా ఉన్న వారిపై వైఎస్సార్సీపీ దృష్టి పెట్టిందని అంటున్నారు. వారికి అనేక రకాలుగా తాయిలాలు ప్రకటించి వైఎస్సార్సీపీలో చేర్చుకుంటారనే చర్చ ఆ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో చేనేతలు ఎక్కువ కావడంతో బీసీ నేతలపైనే వైఎస్సార్సీపీ దృష్టి సారించిందని తెలుస్తోంది. ద్వితీయ శ్రేణి నేతలందరినీ తమ పార్టీలోకి చేర్చుకోవడమే లక్ష్యంగా పార్టీ తరఫున ఒక టీమ్ ను కూడా రంగంలోకి దింపారని చెప్పుకుంటున్నారు.

లోకేష్ ను ఎలాగైనా రెండో సారి కూడా ఓడగొడితే ఆయన ఇక నాయకుడిగా ఎదగకుండా చేయొచ్చని వైఎస్సార్సీపీ భావిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి టీడీపీలో కీలక నేతలు లేకుండా చేయడానికి వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోందని అంటున్నారు.