Begin typing your search above and press return to search.

ఏపీ.. సోష‌ల్ మీడియా గ‌తి త‌ప్పిందా?

By:  Tupaki Desk   |   27 Sep 2022 5:10 AM GMT
ఏపీ.. సోష‌ల్ మీడియా గ‌తి త‌ప్పిందా?
X
సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఎవ‌రికీ తెలియ‌ని నిజాలు అంద‌రికీ తెలుస్తున్నాయ‌ని.. ప్ర‌తి వ్య‌క్తి త‌న అభిప్రాయాలు పంచుకోవ‌డానికి వేదిక దొరికింద‌ని సంతోష‌ప‌డ్డారు. అయితే ఈ సంతోషం తొంద‌ర‌గానే ఆవిరైంది. సోష‌ల్ మీడియా గ‌తి త‌ప్ప‌డ‌మే కార‌ణం. ఒక‌రిపై ఒక‌రు విద్వేషాలు విర‌జిమ్మ‌డం, మ‌తాల‌ను, కులాల‌ను కించ‌ప‌రుస్తూ, వ్య‌క్తుల‌పై ఫేక్ పోస్టులు, ఫేక్ వీడియోలు పెడుతూ, చివ‌ర‌కు ఇళ్ల‌ల్లో ఆడ‌వాళ్ల‌ను, ప‌సి పిల్ల‌ల‌ను కూడా త‌మ వికృత రాజ‌కీయాల‌కు సోష‌ల్ మీడియాలోకి లాగి అల్ల‌రి చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు నువ్వు త‌మ‌ల‌పాకుతో కొడితే నేను త‌లుపుచెక్క‌తో కొడ‌తా అన్న‌ట్టు ఈ విష‌యంలో హ‌ద్దులు దాటిపోతున్నాయ‌నే ఆవేద‌న వ్య‌క్తం అవుతోంది.

ముఖ్యంగా ఏపీలో ప్ర‌ధాన‌ మీడియా పార్టీల‌వారీగా చీలిపోయింది. దీంతో ప్ర‌జ‌లంతా సోష‌ల్ మీడియానే విశ్వ‌సిస్తున్నారు. అందులో వ‌చ్చిన‌వే నిజమ‌నుకుంటున్నారు. దీంతో అక్క‌డ కూడా ఆయా పార్టీలు విష సంస్కృతిని వ్యాపింప‌జేస్తున్నాయి. ఒక నేత అన‌ని మాట‌ల‌ను అనిన‌ట్టు, వీడియోల‌ను తమ‌కు కావాల్సిన చోట క‌ట్ చేసి.. అవ‌స‌ర‌మైన చోట పేస్ట్ చేస్తున్నాయి. అంతేకాకుండా రాయ‌లేని, మాట్లాడలేని రీతిలో త‌మ‌కు గిట్ట‌ని వ్య‌క్తుల‌పై బూతులు, తిట్ల‌తో పోస్టులు పెడుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయా కుటుంబాల్లోని మ‌హిళ‌ల‌ను, పసి పిల్ల‌ల‌ను సైతం లాగి ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

సోష‌ల్ మీడియాలో ఆయా పార్టీల మ‌ధ్య జ‌రుగుతున్న బూతుల దాడి, తీవ్ర విమ‌ర్శ‌లు చూసిన స‌గ‌టు సాధార‌ణ నెటిజ‌న్లు ఏవ‌గించుకుంటున్నారు. సోష‌ల్ మీడియా నిజాల‌ను వెలికి తీస్తుంద‌నుకుంటే చివ‌ర‌కు ఇలా మారిపోయిందేమిట‌నే ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. సోష‌ల్ మీడియాలో ఆయా పార్టీలు, నేత‌లు పెట్టే పోస్టుల‌ను వైర‌ల్ చేయ‌డం.. మ‌ళ్లీ వాటిని ప్ర‌ధాన మీడియాలో చూపించ‌డం, రాయ‌డం ఇలా ఈ దారుణం కొన‌సాగుతూనే ఉంటుంద‌ని ఆవేద‌న చెందుతున్నారు.

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో గ‌తి త‌ప్పాయ‌ని అంద‌రూ అంగీక‌రిస్తున్న‌దే. ఆయా పార్టీల నేత‌ల రాజకీయ ప్ర‌త్య‌ర్థుల్లా కాకుండా ఆగ‌ర్భ శ‌త్రువుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లో ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్సిటీ అని జ‌గ‌న్ ప్ర‌భుత్వం పేరు మార్చింది. దీంతో ఈ వ్య‌వ‌హారంపై ఏపీ అట్టుడుకుతోంది. అటు వైఎస్సార్‌సీపీ, ఇటు టీడీపీ.. ఎన్టీఆర్ గొప్పా.. వైఎస్సార్ గొప్పా అనే చ‌ర్చ‌లు పెడుతున్నాయి. ఈ క్ర‌మంలో ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇది కేవ‌లం కార్య‌క‌ర్త‌లే చేస్తున్నారులే అని వ‌దిలేయ‌డానికి లేదు. చివ‌ర‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం తాము ప్ర‌జాప్ర‌తినిధుల‌మ‌నే సంగ‌తిని మ‌రిచి దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

క‌ర్ణాట‌క‌లో ఇటీవ‌ల పేసీఎం అని కాంగ్రెస్ పార్టీ పోస్ట‌ర్లు అతికించింది. క‌ర్ణాట‌కలో కాంట్రాక్ట‌ర్లు ప‌నులు చేసుకోవాలంటే ఆ రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రికి 40 శాతం క‌మీష‌న్ ఇవ్వాల్సి ఉంటుంద‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అందుకే పేసీఎం అని పేటీఎం మాదిరిగా పోస్ట‌ర్లు సృష్టించి వైరల్ చేసింది.

ఇప్పుడు ఇదే కోవ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భార‌త్ పే అనే పేమెంట్ యాప్ మాదిరిగా పేభార‌తి, భార‌తిపే అంటూ సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి పేరుతో టీడీపీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తోంది.

వైఎస్సార్ అలాంటివాడు అని ఒక‌రు విమ‌ర్శ‌లు చేస్తే.. ఎన్టీఆర్ ఇలాంటివాడు అంటూ మ‌రొక‌రు దానికి కౌంట‌ర్‌గా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇవి ఆ త‌ర్వాత వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, బూతులు తిట్టుకోవ‌డం, ఇళ్ల‌ల్లో ఆడ‌వాళ్ల‌ను, పిల్ల‌ల‌ను సైతం ఈ ర‌చ్చ‌లోకి లాగి అస‌భ్యంగా తిట్టుకునేవర‌కు, పోస్టుల‌ను వైర‌ల్ చేసేవర‌కు వెళ్తోంది. ఈ విష సంస్కృతికి అడ్డుక‌ట్ట పడితే మంచిద‌ని సాధార‌ణ స‌గ‌టు నెటిజ‌న్ ఆశిస్తున్నాడు.

ఆయా పార్టీల విజ‌యం ప్ర‌ధాన మీడియా కంటే సోష‌ల్ మీడియాపైనే ఆధార‌ప‌డి ఉండటంతో వేల సంఖ్య‌లో సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌ను ఆయా పార్టీలు నియ‌మించుకుంటున్నాయి. ఇందుకు ప్ర‌త్యేకంగా స‌ల‌హాదారుల‌ను, ఎన‌లిస్టుల‌ను, స్ట్రాట‌జిస్టుల‌ను నియ‌మించుకుంటున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయ‌ల‌ను మంచినీళ్ల ప్రాయంగా ఆయా పార్టీలు ఖ‌ర్చు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.