ఏపీ సర్కార్ : ఖర్చు డబుల్... ఆదాయం గుబుల్...

Thu Sep 29 2022 12:42:39 GMT+0530 (India Standard Time)

AP Govt: The cost is double... Income

ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువగా వస్తే ఒక కుటుంబం బాగుంది అని అంతా అంటారు మెచ్చుకుంటారు. అలాగే రాష్ట్రమైనా దేశమైనా ఆదాయ మార్గాలు పెంచుకుని ఖర్చులను అప్పులను అదుపులో ఉంచుకుంటే శభాష్ అంటారు.కానీ ఏపీలో ఆ రకమైన పరిస్థితి ఉందా అంటే లేనే లేదు అని చెప్పాల్సిన దుస్థితి. అసలు  విషయానికి వస్తే కేవలం నాలుగు నెలల వ్యవధిలో ఏపీ ఆదాయం 45 వేల కోట్ల రూపాయలు ఉంటే ఖర్చు చూస్తే 86 వేల కోట్ల రూపాయలు ఉంది. దీంతో ఇదేమిటి బాబోయ్ అని ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి.

ఇది ఎవరో చెప్పిన కాకి లెక్క కాదు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ చెప్పిన కీలక సమాచారం అన్న మాట. కాగ్ లెక్కలు చూస్తే ఏపీ ఎంతలా ఇబ్బందులో ఉందో ఇట్టే అర్ధమవుతుంది. గడచిన నాలుగు నెలలలో ఏపీ ఖజానాకు చూస్తే ఆదాయం 45574 కోట్లు రాగా ఇక ఈ నాలుగు నెలల ఖర్చు చూస్తే ఏకంగా 86 281 వేల కోట్లుగా ఉన్నట్లుగా లెక్కలు పక్కాగా చెబుతున్నాయి.

ఇక 2022-23 బడ్జెట్ కోసం వేసిన అంచనాల్లో ఈ ఖర్చు 36.11 శాతం గా ఉండడం అంటే ఆలోచించాల్సిన విషయమే. అంటే బడ్జెట్ లో ఆదాయం లోటు ఈ నాలుగు నెలలకు 17036 వేల కోట్లు అని అంచనా కడితే అది కాస్తా అమాంతం పెరిగి 37849 వేల కోట్లకు ఎగబాకడం అంటే రాష్ట్రం ఏ వైపు ప్రయాణం చేస్తుందో అర్ధం కాక బుర్రలు బద్ధలు కొట్టుకోవాల్సిందే అంటున్నారు. దీన్నే కాగ్ పట్టుకుని ఏకంగా 220 శాతం భారీ  లోటు అంటూ నమోదు చేసింది.

మరో వైపు ద్రవ్య లోటు తీసుకున్నా ఖంగు తినే లెక్కలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు. వార్షిక బడ్జెట్‌లో 8724 వేల కట్ల రూపాయలు ద్రవ్య లోటుగా  అంచనా వేస్తే  కేవలం నాలుగు నెలల్లోనే 42181 కోట్ల రూపాయాలకు అది పెరిగిపోయింది అని కాగ్ అంటోంది. మరి ఇంతలా లోటు వస్తే దాన్ని ఎలా పూరిస్తున్నారు అన్నది ప్రధాన ప్రశ్న.

ఎక్కడ లేని అప్పులను తెచ్చి ఈ లోటుని పూడ్చుతున్నారుట. అలా ఈ నాలుగు నెలలలో చూస్తే ఏపీ అప్పుల కుప్పగా మరింతగా మారింది అని అంటున్నారు. ఇక కేంద్రం అప్పులకు పెట్టిన పరిమితి కూడా మించిపోయింది. కేంద్రం అప్పులకు  నో అంటే కనీస అవసరాలకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడాల్సిందే అంటున్నారు. మొత్తానికి చేసే ఖర్చులో వచ్చే ఆదాయం పది శాతంగా కూడా లేనపుడు ఎంత అప్పు చేసినా ఏమిటి సుఖం అన్న ప్రశ్న అయితే వస్తోంది మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.