Begin typing your search above and press return to search.

భారీగా మద్యం పట్టివేత..చిక్కిన అధికార పార్టీ నాయకులు

By:  Tupaki Desk   |   7 April 2020 8:35 AM
భారీగా మద్యం పట్టివేత..చిక్కిన అధికార పార్టీ నాయకులు
X
దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో దుకాణాలన్నీ మూసివేశారు. వాటిలో మద్యం దుకాణాలు కూడా ఉన్నాయి. అయితే మద్యం దుకాణాలు మూసేసి ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్‌ లో మద్యం భారీగా పట్టుబడుతోంది. ఇప్పటికే పలుచోట్ల మద్యం తరలిస్తున్న వారు పట్టుబడగా తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోటలో కూడా మద్యం తరలిస్తూ కొందరు పోలీసులకు చిక్కారు. అయితే ఆ తరలిస్తు‍న్న వారిలో అధికార పార్టీకి చెందిన వారు ఉండడంతో కలకలం రేపుతోంది.

రాష్ట్రంలో మద్యం దుకాణాలు దశల వారీగా ఎత్తేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కొంత మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించింది. ఇలాంటి సమయంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్‌ విధించారు. దీంతో మద్యం దుకాణాలన్నీ పూర్తిగా మూసేశారు. మద్యం విక్రయాలు - తరలించడం పూర్తిగా నిషేధించారు. అయితే ఇవన్నీ కొందరు పట్టించుకోవడం లేదు. తాజాగా గిద్దలూరు మండలం గడికోటలో కొందరు పెద్ద ఎత్తున మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు. అయితే వారిలో అధికా పార్టీకి చెందిన వారు ఉ‍న్నారని సమాచారం. ఇటీవల జరిగిన ఎంపీటీసీ సభ్యుల ఎన్నికల్లో ఏకగ్రీవం గా ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికైన పిడుగు శ్రీనివాస్‌ రెడ్డి ఉన్నారు. అతడు తన కారులో మద్యం తరలిస్తుండగా ఒంగోలు ఎక్సైజ్‌ - ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ - సీఐ తిరుపతయ్య సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. 24 కేసుల మద్యం స్వాధీనం చేసుకుని అతడిని పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.

అయితే ఈ మద్యం తరలింపులో మాజీ ఎంపీపీ - సొసైటీ మాజీ అధ్యక్షుడు - ఓ వైద్యుడు ఉన్నాడని సమాచారం. ఆ వైద్యుడు గతంలో మద్యం వ్యాపారం చేశాడని - పెద్ద ఎత్తున మద్యం వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడని తెలుస్తోంది. గతంలో నంద్యాల నుంచి కల్తీ మద్యం తెచ్చి విక్రయించిన చరిత్ర అతడికి ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం వారు పట్టుబడిన వారు అధికార పార్టీకి చెందిన వారు. మరి వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారా? లేదా వదిలేస్తారా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారి వెనుక ఉన్న పెద్దలను కూడా అరెస్ట్‌ చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.