Begin typing your search above and press return to search.

ముద్దుల మీద ముద్దులు పెట్టే... .సాంగ్ వైరల్

By:  Tupaki Desk   |   20 Jan 2022 2:30 PM GMT
ముద్దుల మీద ముద్దులు పెట్టే... .సాంగ్ వైరల్
X
వాటే రైమింగ్..వాటే టైమింగ్. సాంగ్ సూపర్ గా ఉంది. ఇది ఏ కొత్త సినిమాలోనిది కాదు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు కలెక్టరేట్ల ముట్టడి సందర్భంగా జరిపిన ఆందోళనలో గళానికీ కళానికి పని చెప్పి మరీ వెలువరించిన మాటల తూటాలు, అలవోకగా పాడిన పాటలు. ముద్దుల మీద ముద్దులు పెట్టే ముఖ్యమంత్రి గారూ, మాట తప్పనీ మడమ తిప్పని సీఎం సారూ.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి సారూ అంటూ ఉద్యోగ సంఘాలు మంచి రిధంలో పాడుతూంటే ఆందోళనలో అవే హైలెట్ అవుతున్నాయి.

అంతే కాదు ఈ పాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి సీఎం సారూ అంటూ ఉద్యోగులు పాడుతూ తెగ హల్ చల్ చేస్తున్నారు. మీకు విద్యను నేర్పిన గురువులకే పంగనామాలు పెడతారా సారూ.. మీకు బెయిల్ ఇచ్చిన జడ్జీకేమో పాత జీతమాయే. మీ మానాసపుత్రిక సచివాలయం వెక్కి వెక్కి ఏడ్చే అంటూ ఉద్యోగులు పాట కట్టి ట్యూన్లు సెట్ చేసి మరీ గట్టిగా పాడేస్తున్నారు.

మీ పీయార్సీ అంతా రివర్స్ గేరూ ఇలా ఎందుకండీ సారూ, చెట్టుని ఎక్కి మొదలు నరకడం మీకే మంచిది కాదూ, అప్పుల మీద అప్పులు చేసి తిప్పలెందుకండీ. వెనకటి వారు ఏలిన రీతిగ మీరు నడచుకోండీ అంటూ జగన్ కి సలహాలు సందేశాలు ఇస్తూ ఉద్యోగుల పాటలు సాగుతున్నాయి. నవరత్నాలు, మాణిక్యాలు ఎవరికి ఎందుకండీ, మీరు ఇచ్చిన మాట నిలుపుకోండి, మా మనసు గెలుచుకోండి సీఎం గారూ అంటూ ఉద్యోగులు ఘాటుగా స్వీటుగా కూడా సూచిస్తున్నారు.

మొత్తానికి జగన్ పాలన మీద ఇప్పటిదాకా విపక్షాలే విమర్శలు చేశాయి. కానీ ఫస్ట్ టైమ్ ప్రభుత్వ ఉద్యోగులు రెండున్నరేళ్ల పాలన మీద విమర్శలు చేస్తూ పాటల రూపంలో జగన్ని టార్గెట్ చేయడం మాత్రం విశేషంగా చూస్తున్నారు. మాట తప్పని మడమ తిప్పని సీఎంగా ఉండాలి సారూ అంటూనే కొత్త పీయార్సీ పేరిట మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారా సారూ అని కస్సుమంటున్నారు.

ఇంకో వైపు విశాఖ కలెక్టరేట్ లో కూడా ఉద్యోగులు ముఖ్యామంత్రి జగన్ని విమర్శిస్తూ పాటలు కట్టారు. రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటున్నారు సీఎం గారు, కొత్త పీయార్సీ పేరిట మన దగ్గరే పది పైసలు పట్టుకుపోతున్నారు సారూ అని ఉద్యోగులు సెటైరికల్ గా పాడుతూ హోరెత్తించారు.

ఇదిలా ఉంటే ఉద్యోగుల ఆందోళంతో ప్రభుత్వ వర్గాలలో కొంత ఆందోళన కనిపిస్తోంది. మంత్రి పేర్ని నాని అయితే ఉద్యోగ సంఘాలు మమ్మల్ని అర్ధం చేసుకోవాలి అంటూ ప్లీజింగ్ మానర్ లో రిక్వెస్ట్ చేయడం ఆ విధంగానే చూడాలి. కరోనా పరిస్థితుల నేపధ్యంలోనే ఇలా చేయాల్సి వచ్చిందని ఆయన అంటున్నారు. ఉద్యోగులు ఆశించిన రీతిన చేయనందుకు బాధగానే ఉందని అంటూ మొత్తంగా చూస్తే జీతాలు పెరుగుతాయా లేదా అన్న తేడాను చూడాలని కోరుతున్నారు. మరి జగన్ కస్సుబుస్సులాడుతున్న ఉద్యోగుల మనసు గెలుచుకుంటారా. వారి డిమాండ్లకు తలవొగ్గుతారా.