Begin typing your search above and press return to search.

సమ్మె సైరన్ మోగింది... సర్కార్ ఏం చేయనుంది...?

By:  Tupaki Desk   |   24 Jan 2022 12:31 PM GMT
సమ్మె సైరన్ మోగింది... సర్కార్ ఏం చేయనుంది...?
X
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వారు తగ్గేది లేదు అంటున్నారు. దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే కొత్త పీయార్సీ విషయంలో తగ్గింపు జరిగింది, ఐ ఆర్ కంటే ఫిట్మెంట్ బాగా తక్కువ అని ఉద్యోగులు గోడు పెట్టారు. అయినా బాగుంది అంటూ ఉద్యోగ సంఘాల నేతలు నాడు మీడియా మీటింగ్స్ పెట్టారు. అయితే దాని మీద ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ పరిణామాలు ఇలా ఉండగానే ప్రభుత్వం హెచ్ఆర్ఏ లో కోత విధిస్తూ హడావుడిగా అర్ధరాత్రి వేళ జీవోలు రిలీజ్ చేసింది. మొత్తానికి ఆందోళనకు సిద్ధమని చెబుతున్న ఉద్యోగులకు ప్రభుత్వ దూకుడు కూడా అలాగే సాగిపోమన్నట్లుగా దారి చూపినట్లుంది.

మొత్తం మీద చూసుకుంటే సమ్మె సైరన్ మోగింది. మరో వైపు మంత్రులతో సంప్రదింపుల కమిటీని వేసినా కూడా ఉద్యోగులు దానికి హాజరు కాలేదు. సమ్మెకే మొగ్గు చూపారు. ఇప్పటికి పది రోజుల్లో సమ్మె జరగబోతోంది. మరి సమ్మె విరమణకు అవకాశాలు ఉన్నాయా అంటే చర్చల ద్వారా ఎపుడూ దారి ఉంటుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఉద్యోగులతో చర్చలు అన్నీ మంత్రుల కమిటీ ద్వారానే జరపాలనుకుంటోంది.

ఆ కమిటీ కూడా కొత్త పీయార్సీ వల్ల కలిగే లాభాలను వివరించనుంది. అంతే తప్ప కొత్తగా ఏ సమస్యకూ పరిష్కారం అయితే అక్కడ లభించే వీలు లేదు అని అంటున్నారు. దాంతోనే ఉద్యోగ సంఘాలు కూడా మేము మంత్రుల కమిటీకి దూరం అంటున్నారు. పీయార్సీ జీవోలను రద్దు చేస్తేనే తాము చర్చకు వస్తామని చెబుతున్నారు. ఇది ఉద్యోగుల వైపు అయితే ప్రభుత్వం కూడా ఈ దశలో అలాగే ఉంది అంటున్నారు.

తాము ఉద్యోగులకు చేయాల్సినంతగా చేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి చెబుతున్నారు. ఉద్యోగులకి ప్రకటించిన కొత్త పీయార్సీ వల్ల పది వేల కోట్లకు పైగా భారం పడింది అని కూడా అంటున్నారు. ఉద్యోగులు అన్నీ అర్ధం చేసుకుని చర్చలకు రావాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమ్మె మీద ప్రజలకే నేరుగా వాస్తవాలు చెప్పాలనుకుంటోందిట.

వాలంటీర్ల ద్వారా పెరిగిన జీతాలు, ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత ఇచ్చింది అన్నది లెక్కలతో టేబిల్స్ తో సహా ప్రతీ ఇంటికీ వెళ్ళి వివరించే ప్రయత్నం చేయాలని చూస్తోందని అంటున్నారు. ఇంకో వైపు ప్రభుత్వం ఉద్యోగులు సమ్మె దారి వీడకపోతే ఏమేమి చేస్తుంది అన్న దాని మీద ప్రచారం అయితే సాగుతోంది. దాని ప్రకారం చూస్తే ప్లాన్ ఏ బీ సీ డీ ఇలా అనేకం ఉన్నాయనే అంటున్నారు.

ముందుగా ప్లాన్ ఏ చూస్తే చర్చలకు కమిటీని ఏర్పాటు చేశారు. అయితే అది వర్కౌట్ అయ్యేలా సీన్ లేదు. మరో వైపు టైమ్ చూసుకుని ప్లాన్ బీ కింద ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తారని అంటున్నారు. అలాగే, ప్లాన్ సీ చూస్తే కోర్టులో తమ వాదనను ధీటుగా వినిపించి అక్కడ నుంచే ఉద్యోగుల విషయంలో తేల్చుకోవాలని సర్కార్ కి ఉందని అంటున్నారు. వీటితో పాటుగా ప్లాన్ డీ కూడా ఉంది. ఇదే అసలైనది. ఒక విధంగా కఠినమైనది కూడా. సీన్ అంతవరకూ వెళ్తుందని ఎవరూ అనుకోవడం లేదు. ఒక వేళ వెళ్తే కనుక ప్రభుత్వం చిట్ట చివరి అస్త్రంగా ప్లాన్ డీని బయటకు తీస్తుంది అంటున్నారు.

అదేంటి అంటే జగన్ సర్కార్ అంటే ఏంటో చూపించేలా ఉద్యోగులను తొలగించడం. నిజంగా ఇది దుస్సాహసం అనే చెప్పాలి. కానీ జగన్ ప్రభుత్వం అలా వెళ్తుంది అంటే కాదు అని కూడా అనలేరు ఎవరూ. గతంలో పలు రాష్ట్రాల్లో దాన్ని అమలు చేశారు కూడా. దాంతో ఇప్పటికైతే దాని మీద అధ్యయం చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఉద్యోగుల డిమాండ్లకు లొంగకూడదని ప్రభుత్వం అయితే గట్టిగానే భావిస్తోంది అంటునారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.