Begin typing your search above and press return to search.

ఏపీలో డిసెంబర్ లో ఎన్నికలు... కంఫర్మ్ అయినట్లే...!

By:  Tupaki Desk   |   31 May 2023 8:00 PM GMT
ఏపీలో డిసెంబర్ లో ఎన్నికలు... కంఫర్మ్ అయినట్లే...!
X
ఏపీలో తెలంగాణాతో పాటే ఎన్నికలు జరుగుతాయని ఒక ప్రచారం అయితే గత కొన్నాళ్లుగా వాడిగా వేడిగా ప్రచారం సాగుతోంది. దానికి ఉన్న సహేతుకత ఎంత అనేది కూడా చర్చకు వస్తోంది. అయితే ఇపుడు మాత్రం ఒక కచ్చితమైన స్పష్టత అయితే వచ్చినట్లే అంటున్నారు. అన్ని విధాలుగా ఆలోచించుకున్న మీదటనే ముందస్తు ఎన్నికలకు వైసీపీ ప్రభుత్వం రెడీ అవుతోంది అని అంటున్నారు.

ముఖ్యంగా ముందస్తు ఎన్నికలకు వైసీపీ వెళ్లడానికి అనేక రాజకీయ కారణాలు. లాభాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటి అంటే యాంటీ మోడీ అని అంటున్నారు. మోడీకి వ్యతిరేకంగా ఏపీ ప్రజలు ఉన్నారు. అయితే ఇప్పటికే గ్రౌడ్ లెవెల్ లో మోడీ జగన్ ఒక్కటే అన్న భావన పెరిగింది. అదే 2024 లోక్ సభతో పాటు అసెంబ్లీకి కలిపి ఎన్నికలు జరిపిస్తే మాత్రం మోడీ వ్యతిరేకత తన పార్టీ మీద పడుతుంది అన్న దాంతోనే విడిగా ఎన్నికలను వైసీపీ పెద్దలు కోరుకుంటున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే విడిగా ఎన్నికలు జరిగితే మోడీ బీజేపీకి ఒక్క శాతం ఓట్లు కూడా రావు. ఇక మోడీ వచ్చే ఎన్నికలు కలిపి జరిగితే న్యూట్రల్ గా ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే అది పూర్తిగా వైసీపీకి ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు. ముఖ్యంగా పార్టీలో జరిగే నగదు బదిలీ వ్యవహారాల్లో చూసీ చూడనట్లుగా గతంలో వ్యవహరించడం వల్లనే వైసీపీకి నల్లేరు మీద నడకలా గత ఎన్నికల్లో అంతా జరిగిపోయింది. అదే 2024 నాటికి మోడీ కాస్తా గట్టిగా బిగిస్తే మాత్రం అధికార వైసీపీకి యాంటీ అవుతుంది. అదే టీడీపీకి వరంగా మారుతుంది.

దాంతో ఈ తంటా ఎందుకు అనుకుంటూ ముందుగా ఎన్నికలకు వెళ్తే కేంద్రం పెద్దగా ఏపీ వైపు చూడదు, విజయావకాశాలు ఉంటాయి కాబట్టి గెలవవచ్చు అన్నదే వైసీపీ పెద్దల ప్లాన్ అని అంటున్నారు. ఇక మరో పాయింట్ కూడా ఉంది అంటున్నారు. వైసీపీకి 2019లో ప్రాణాలకు తెగించి క్యాడర్ పనిచేసింది. జగన్ సీఎం కావాలి అనుకుంటూ అంతా సర్వశక్తులు ఒడ్డారు.

గత నాలుగేళ్ళుగా చూసుకుంటే క్యాడర్ పూర్తిగా డల్ అయింది. ఆ ప్లేస్ లోకి వాలంటీర్లు వచ్చి చేరారు. వారిదే ఇపుడు పెత్తనంగా ఉంది. రెండున్నర లక్షల దాకా ఉన్న వాలంటీర్లనే ప్రభుత్వ పెద్దలు బాగా నమ్ముకున్నారు. ఇక క్యాడర్ కాడె వదిలేసింది. ప్రతీ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ పార్టీ పడకేసింది. ఈ పరిస్థితి మరింతగా ముదరకముందే ఎన్నికలకు వెళ్తే తిరిగి గెలవవచ్చు అన్న లెక్కలు దగ్గర పెట్టుకుని మరీ వైసీపీ కొత్త ఆలోచనలకు తెర తీశారు అని అంటున్నారు.

ఇక మరో ఆలోచన కూడా వైసీపీకి ఉందిట. అదేంటి అంటే ఇప్పటికే నాలుగేళ్ళ పాలన పూర్తి అయింది. జనాల్లో వ్యతిరేకత అయితే బాగానే ఉంది. అది ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలలో బాగా కనిపించింది అని అంటున్నారు. మొత్తం మూడు ఎమ్మెల్సీ సీట్లూ టీడీపీ ఖాతాల్లో పడిపోయాయి. దాంతో ఇక ఏడాది దాకా కూర్చుని 2024 లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తే మాత్రం పుట్టె పూర్తిగా మునగడం ఖాయమని వైసీపీ భావిస్తొందిట. అందుకే ఆరు నూరు అయినా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయింది అని అంటున్నారు.

ఇక డిసెంబర్ లో ఎన్నికలు అంటే బీజేపీ పెద్దల చూపు ఎక్కువగా తెలంగాణా వైపు మాత్రమే ఉంటుంది. దాంతో ఏపీలో హ్యాపీగా వైసీపీ తన పని తాను చేసుకోవచ్చు అని అంటున్నారు. తెలంగాణాలో ఏపీలో బీజేపీ టీడీపీ పొత్తులు కుదురుతాయని అనుకున్నా అది ఏపీలో అంత ప్రభావం చూపించే అవకాశం లేదు అని అంటున్నారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఇంకా టీడీపీని పూర్తి స్థాయిలో సమాయత్తం చేసుకోలేదు.

పొత్తుల కధ అలాగే ఉంది. అభ్యర్ధుల సెలెక్షన్ కూడా ఇంకా కొలిక్కి రాలేదు. విపక్షంలో ఉన్న పార్టీ కాబట్టి చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. అందుకే డిసెంబర్ లో ఎన్నికలు అంటే అది తమకు బాగా ఉపయోపడుతుందని వైసీపీ భావిస్తోందిట. ఇదిలా ఉండగా ఏపీలో డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయమని బీజేపీలో ఒక సీనియర్ మోస్ట్ నేత ఢిల్లీలో ఇటీవల చేశారని వస్తున్న ప్రచారం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నాయి. ఏది ఏమైనా ఏపీలో డిసెంబర్ లో ఎన్నికలు ఖాయమని అంటున్నారు.