Begin typing your search above and press return to search.

కోటి ఎస్సెమ్మెస్‌లు.. ఎన్ని మొబైళ్ల నుంచి... ??

By:  Tupaki Desk   |   22 Sep 2015 11:30 PM GMT
కోటి ఎస్సెమ్మెస్‌లు.. ఎన్ని మొబైళ్ల నుంచి... ??
X
ఆంధ్రప్రదేశ్‌లోని విపక్ష పార్టీలన్నీ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం అనే అంశాన్ని తమకు చేతనైనంతగా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి నానా పాట్లు పడుతున్నాయి. అన్ని పార్టీల దృష్టి ఆ అంశం మీదనుంచి మరలిపోవడం లేదు. వైకాపా భారీ ఎత్తున దీక్షకు సిద్ధం అవుతోంది. సీపీఐ ఆల్రెడీ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించింది. అసలు ప్రత్యేకహోదాను మేం ఎప్పుడో ఇచ్చేశాం.. మోడీ మోసం చేస్తున్నాడు అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం అలవాటు చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. పోరాటంలో ఒక రకంగా వెనకబడి ఉన్నట్లు చెప్పుకోవాలి. ఆ పార్టీకూడా ప్రస్తుతం హోదా కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలోనే ఉన్నది. కేంద్రానికి కోటి ఎస్సెమ్మెస్‌లను పంపే యజ్ఞం నిర్వహిస్తున్నట్లుగా ఆ పార్టీ సారధులు ప్రకటించారు.

ప్రత్యేక హోదా విషయంలో.. అసలే కేడర్‌ బలం సరిగా లేని తమ పార్టీ తరఫున ఏం చేయాలన్నా కూడా ఏపీ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తలకిందులు అయిపోతున్నారు. వారికి ఒక పట్టాన ఏమీ తోస్తున్నట్లుగా లేదు. ఇదివరకు ఇలాంటిదే ఒక ప్రహసనం నడిపించారు. ప్రత్యేకహోదా కోసం కోటి సంతకాలు సేకరిస్తున్నాం అన్నారు. అసలు రాష్ట్రంలో మొత్తం జనాభా ఎంత ఉన్నదో.. వారు ఎంతమందిని కలిసి ఎన్ని సంతకాలు సేకరించారో.. స్పష్టత లేదుగానీ.. కొన్నాళ్ల తర్వాత.. కోటి సంతకాలు పూర్తయిపోయాయని సెలవిచ్చారు. ఆ సీడీలను తీసుకువెళ్లి తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చేతుల్లో పెట్టారు. ఆమెకు అందజేస్తే ఏం ఫలితం ఉంటుందని వారు అనుకున్నారో తెలియదు. వారి చేతలను గమనిస్తే.. హోదా రావడం కంటే.. ఏపీలో పార్టీని సజీవంగా ఉంచడానికి తమ పాట్లు తాము పడుతున్నాం అనే భావన అధినేత్రికి కలిగించడం ఒక్కటే టార్గెట్‌ అన్నట్లుగా సాగింది.

అప్పట్లో సోనియాను పిలిపించి, విజయవాడలో ప్రత్యేకహోదా డిమాండు కోసం ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం.. అంటూ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి చాలా డాబుసరిగా ప్రకటించారు. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి మేడం విజయవాడ రావడం కాదు కదా.. కనీసం ఢిల్లీలో కూడా ప్రత్యేకహోదాపై పెదవి విప్పలేదు.

ఆ ఎపిసోడ్‌ ముగిసిపోయిన తర్వాత.. ఇప్పుడు మళ్లీ కొత్త ఎపిసోడ్‌ ప్రారంభించారు. కోటి ఎస్సెమ్మెస్‌లు ఇవ్వడం ద్వారా కేంద్రంలో కదలిక తీసుకువస్తాం అని పీసీసీ నాయకులు అంటున్నారు. ఇంతకూ కోటి ఎస్సెమ్మెస్‌లను వారు ఎన్ని మొబైల్‌ నెంబర్లనుంచి ఇవ్వదలచుకున్నారు. కోటిమందికి చెందిన మొబైల్స్‌నుంచి ఎస్సెమ్మెస్‌లు ఇవ్వడానికి అంత కేడర్‌ వారికి ఉన్నదా? ఒకే మొబైల్‌నుంచి బోలెడు ఎస్సెమ్మెస్‌లు ఇస్తే వాటికి విలువ ఉంటుందా? అసలు ఇలాంటి ఉద్యమాల వలన హోదా వస్తుందా? అనే సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి. మరి పీసీసీ నాయకుల ఆలోచన ఎలా ఉన్నదో!