Begin typing your search above and press return to search.

వైసీపీ నెత్తిన రుణం పాలు పోస్తారా.....నిర్మలమ్మతో జగన్

By:  Tupaki Desk   |   30 March 2023 11:03 PM GMT
వైసీపీ నెత్తిన రుణం పాలు పోస్తారా.....నిర్మలమ్మతో జగన్
X
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక మధ్యతరగతి గృహిణి నుంచి కేంద్ర ఆర్ధిక మంత్రిగా కీలక బాధ్యతలను నిర్వహించే స్థాయికి ఎదిగారు. అయినా ఆమె తన మూలాలను ఎపుడూ మరచిపోలేదు. అప్పు తప్పు అనే అంటారు. కేంద్రం అప్పులు చేయడం సంగతి మోదీ వరకూ ఓకే కానీ రాష్ట్రాలు అప్పులు చేస్తే మాత్రం కాదూ కూడదనే అంటారు.

అలా ఏపీకి కూడా అతి పెద్ద చెక్ పెట్టేశారు. అప్పులు చేసుకునేందుకు ఉన్న రుణ పరిమితిని ఏకంగా 2021-22లో 42 వేల 472 కోట్ల రూపాయల నుంచి అడ్డంగా తగ్గించిన 17 వేల 923 కోట్ల రూపాయలు కోత పెట్టారు. దాంతో 26 వేల కోట్లకు రుణ పరిమితి పడిపోయింది. దాన్ని యధాతధంగా 43 వేల కోట్ల రూపాయల దాకా పెంచుకునే వీలు కల్పించమని జగన్ కేంద్ర మంత్రిని కోరారు.

ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పు లేకుండానే 2021-22 సంవత్సరంలో పెద్ద మొత్తంలో రుణ పరిమితిలో కోత పెట్టరని, దాన్ని సవరించాల్సిందే అని ఆయన కోరారు ఇక 2014-15 ఆర్ధిక సంవత్సరానికి వనరుల అంతరాన్ని తగ్గించడానికి ఇచ్చే నిధుల కింద ఇప్పటికే పెండింగ్ లో 36 వేల 625 కోట్ల రూపాయలు ఉన్నాయని వాటిని వెంటనే ఏపీకి మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి వినతి చేశారు

అలాగే రాష్ట్రానికి రావాల్సిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం కింద బకాయిలను కూడా విడుదల చేయాలని కేంద్ర మంత్రిని జగన్ కోరారు. మరో వైపు చూస్తే 2014 నుంచి 2017 మధ్యలో ఏపీ నుంచి తెలంగాణాకు విద్యుత్ సరఫారా జరిగిందని, అలా తెలంగాణా ప్రభుత్వం అక్కడి డిస్కమ్‌ల నుండి ఏపీ జెన్కోకు బకాయిపడిన 7 వేల 58 కోట్ల రూపాయలను తక్షణం చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకోవలాని జగన్ కోరారు.

వీటితో పాటుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో వేగవంతం చేసేందుకు తక్షణమే 10 వేల కోట్ల రూపాయల నిధులను కేంద్రం కేటాయించాలని, అలాగే, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడంతో ప్రధాన డ్యాం వద్ద ఏర్పడిన స్కార్జ్ పిట్లను పూడ్చేందుకు మరో రెబండు వేల 20 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని ముఖ్యమంత్రి జగన్ అభ్యర్ధించారు.

అలాగే ఇప్పటిదాక ఏపీ ప్రభుత్వం తన ఖజానా నుంచి పోలవరం ప్రాజెక్ట్ కి 2,600.74 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని జగన్ గుర్తు చేశారు. ఆ నిధులను వెంటనే రీయింబర్స్‌మెంట్ చేయాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టుపై టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ సవరించిన అంచనాలతో ఆమోదించిన 55 వేల 548 కోట్ల రూపాయలను కూడా ఆమోదించాలని కేంద్రాన్ని జగన్ డిమాండ్ చేశారు. చివరాఖరున రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామన్న హామీని అమలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

వీటిలో జగన్ కోరినవి అన్నీ కేంద్రం తీరుస్తుందా అన్నదే చూడాలి. ముందుగా పోలవరం గురించి మాట్లాడుకుంటే తొమ్మిదేళ్ల కాలంలో కేంద్రం నుంచి ఇప్పటి దాకా పోలవరం ప్రాజెక్ట్ కోసం విడుదల చేసింది కేవలం 13 వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఆ విషయాన్ని కేంద్ర మంత్రే పార్లమెంట్ లో చెప్పారు.

ఎపుడూ కూడా కేంద్రం పోలవరం విషయంలో రెండు వేల లోపు నిధులను మాత్రమే రీ ఎంబర్స్ మెంట్ గా ఇస్తూ వస్తోంది. అయితే ఒక్కసారిగా పది వేల కోట్లను కేంద్రాన్ని ఇవ్వమని కోరడం ఏపీ సీఎం జగన్ బాధ్యతగా అడిగినా ఆ దిశగా కేంద్రం రియాక్ట్ అవుతుందా అన్నది సందేహమే అంటున్నారు. మరో వైపు ఏపీలో అప్పులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయన్నదే జాతీయ స్థాయిలో కోడై కూస్తున్న విషయం.

కేంద్ర మంత్రులు సైతం పార్లమెంట్ లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. 43 వేల కోట్ల రుణ పరిమితిని తగ్గించడానికి కూడా ఇదే ప్రధాన కారణం అని చెబుతారు. అప్పులు చేసుకునే వెసులుబాటు ఇవ్వండి అని జగన్ కోరితే కేంద్రం ఓకే అని చెప్పదనే అంటున్నారు. ఇంకో వైపు తెలంగాణా నుంచి విద్యుత్ బకాయిలు ఏడు వేల కోట్ల రూపాయలను ఇప్పించమని ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. దానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని అంటారు.

తెలంగాణాలో బీజేపీ రాజకీయ ఆశలు ఇమిడి ఉండడమే కారణం అని చెబుతారు. సో ఆ విషయం కూడా పట్టించుకుంటారా అన్నది డౌటే అంటున్నారు. డయాఫ్రం వాల్ ఎలా కొట్టుకుపోయింది అన్న దాని మీద వైసీపీ టీడీపీ రెండూ పరస్పర విమర్శలు చేసుకుంటాయి. భారీ వరదల వల్ల అని టీడీపీ అంటే కాపర్ డ్యాం ముందు కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టడం వల్ల అని వైసీపీ ఆరోపిస్తుంది. బీజేపీ ఈ గొడవను చూస్తూ చూస్తూ తామే రెండు వేల కోట్లు స్కార్జ్ పిట్లను పూడ్చేందుకు ఇస్తుందా అన్నది చూడాలి.

అలాగే ఆర్ధిక వనరుల గ్యాప్ ని భర్తీ చేస్తామంటూ పుణ్యకాలం దాటవేశారు. ఇపుడు ముప్పయి ఆరు వేల కోట్లు ఒక్కసారిగా ఇస్తారా అన్నది అనుమానమే. చివరాఖరుగా ప్రత్యేక హోదా అన్నది జస్ట్ డిమాండ్ గా మాత్రమే ఏపీ నుంచి వెళ్తోంది. దానికి జవాబు కేంద్ర పెద్దల వద్ద ఎపుడూ రెడీగా ఉంది.

ఏతా వాతా తేలేది ఏమిటి అంటే ముఖ్యమంత్రి పలు మార్లు ఢిల్లీ వెళ్ళి వినతులు చేసుకోవడమే కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన చాలా వాటిలో వస్తుందా అంటే చెప్పలేమనే అంటున్నారు. అయితే అప్పులు చేసుకునే వెసులుబాటు అయినా కేంద్రం ఇస్తే పదివేలు అని తలపోస్తున్న వైసీపీ నెత్తిన రుణం పాలు పోస్తారా అన్నదే చూడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.