Begin typing your search above and press return to search.

ఓటమి ఖాయమని జగన్ కు ముందే తెలుసా ?

By:  Tupaki Desk   |   25 March 2023 12:05 PM GMT
ఓటమి ఖాయమని జగన్ కు ముందే తెలుసా ?
X
ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికలపై చాలా పోస్టుమార్టాలే జరిగాయి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినా మరొకళ్ళు చెప్పినా అన్నీ కతలే అని అర్ధమవుతున్నాయి. విషయం ఏమిటంటే ఎంఎల్సీ ఎన్నికల పోలింగుకు ముందే వైసీపీ తరపున పోటీచేసిన ఏడుగురిలో ఒకళ్ళ ఓటమి ఖాయమని జగన్ అండ్ కోకు స్పష్టంగా తెలుసు. కాకపోతే ఓడిపోయే ఆ ఒక్కళ్ళు ఎవరు అన్నదే తెలీదు.

సజ్జల మీడియాతో మాట్లాడినపుడు ఒకమాట చెప్పారు. అదేమిటంటే వైసీపీలోని నలుగురు ఎంఎల్ఏలతో చంద్రబాబునాయుడు మాట్లాడుకుని కమిట్మెంట్ తీసుకున్నారట. నలుగురి ఓట్ల విషయంలో బాగా నమ్మకం కుదిరిన తర్వాతే చంద్రబాబు అభ్యర్ధిని పోటీలోకి దించినట్లు సజ్జలే చెప్పారు. ఇదే విషయాన్ని మరికొందరు మంత్రులు, ఎంఎల్ఏలు కూడా వినిపించారు. సజ్జల చెప్పిన విషయం నిజమే అని అనుకుంటే తమ ఎంఎల్ఏల్లో నలుగురు టీడీపీ అభ్యర్ధికి ఓట్లేయబోతున్నట్లు జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసనుకోవాలి.

ప్రతి ఎంఎల్సీకి రావాల్సింది 22 మంది ఎంఎల్ఏల ఓట్లు. టీడీపీకి ఉన్నది 19 ఓట్లుమాత్రమే. అయితే సజ్జల చెప్పిందాని ప్రకారమే టీడీపీ ఒరిజినల్ ఓట్లు 19+ వైసీపీ నుండి క్రాస్ అవబోయే 4 ఓట్లు కలిపి టీడీపీ అభ్యర్ధికి 23 ఓట్లు పోలవుతాయని ముందే తెలుసు. రెబల్ ఎంఎల్ఏల ఓట్లు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ఓట్లు తమకు పడవని అంచనా వేసినట్లు సజ్జలే చెప్పారు.

ఇక మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవికి వచ్చేఎన్నికల్లో టికెట్లిచ్చేది లేదని జగన్ చెప్పేసినట్లు సజ్జల చెప్పారు. ఎలాగూ టికెట్లు రావని అనుకున్నపుడు వీళ్ళిద్దరు జగన్ కు లాయల్ గా ఉండాల్సిన అవసరం ఏముంది ? ఉంటారని ఎలా అనుకున్నారు. ఎంఎల్ఏలు చెప్పిన పనులు జరగటంలేదు. వాళ్ళ స్ధానాల్లో ఇన్చార్జిలను వేసేశారు. పార్టీలో వాళ్ళని ఎవరూ పట్టించుకోవటంలేదు. ఫైనల్ గా వీళ్ళిద్దరు పోలింగ్ రోజున కలిసినపుడు కూడా టికెట్ ఇవ్వనని జగన్ తేల్చేశారు. ఈ విషయాలు గ్రహించే వీళ్ళిద్దరు చంద్రబాబుతో టచ్ లోకి వెళ్ళుంటారు. అందుకనే వీళ్ళు తమ ఓట్లను టీడీపీకి వేసేశారు. అంటే ఏడుగురిలో ఒకళ్ళు ఓడటం ఖాయమని జగన్ కు ముందే తెలుసని అర్ధమవుతోంది. కాకపోతే ఆ ఒక్కళ్ళు కోలా గురువులు అన్నది పోలింగ్ తర్వాత బయటపడిందంతే.