'జగన్ నెంబరు 1' కోరిక తీర్చుకోలేకపోయిన వైసీపీ

Fri Mar 24 2023 12:12:30 GMT+0530 (India Standard Time)

AP CM Ys Jagan Mohan Reddy

కొన్ని విషయాలకు అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవటం కనిపిస్తుంది. తమ అధినాయకుడ్ని దేవుడిగా కీర్తిస్తూ.. ఆయన ఎక్కడైనా నెంబర్ వన్ గానే ఉండాలంటూ తపించే వైసీపీ బ్యాచ్ చేసిన ప్రయత్నాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. తమ అధినేత జగన్ చేత మొదటి ఓటు వేయాలని.. పుస్తకంలో మొదటి నెంబరు ఉన్న ఓటు ఆయన పేరుతో తెగాలని తెగ తపించారు. ఇందుకోసం పోలింగ్ ను కాసేపు ఆలస్యంగా షురూ చేశారు.మనం అనుకుంటే సరిపోతుందా? దేవుడి స్క్రిప్టు అంటూ ఒకటి ఉంటుంది కదా? అది కూడా వైసీపీ పరివారం అమితంగా నమ్మే దేవుడి స్క్రిప్టు ఎందుకో గురువారం వారికి అనుకూలంగా లేని పరిస్థితి. ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు 1 నుంచి 200 వరకు నంబర్లు ఉన్న బ్యాలెట్ పత్రాల్ని సిద్ధం చేశారు. ఒక్కో పుస్తకంలో 25 ఓట్ల పత్రాలు ఉన్నాయి.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేత మొదటి ఓటు వేయించాలని తపించారు.

ఇదే విషయాన్ని ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులకు కూడా వైసీపీ నేతలు తెలియజేశారు. సీఎం స్వయంగా ఓటు వేసే విషయంలో ఆయనకు అమిత ప్రాధాన్యత ఇస్తారన్నది తెలిసిందే. సీఎం జగన్ చేత మొదటి ఓటు వేయించటం కోసం కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ముందుగా అసెంబ్లీకి చేరుకున్నారు. జగన్ చేత మొదటి ఓటు వేయించటం కోసం కాసేపు వెయిట్ చేశారు. అయితే.. సీఎం జగన్ ఓటు వేయటానికి వచ్చేసరికి.. బ్యాలెట్ పత్రాలు ఇచ్చే అధికారి వద్ద ఒకటో నెంబరు పత్రంతో మొదలయ్యే పుస్తకం కాకుండా మరొకటి ఉంది.

దీంతో.. ఆ అధికారి ఒకటో నెంబరు బ్యాలెట్ పత్రంతో మొదలయ్యే పుస్తకం కోసం సిబ్బందిని పురమాయించారు. ఇదిలా ఉండగా.. అదే సమయంలో పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న టీడీపీ సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ వచ్చి మొదటి ఓటు వేశారు. దీంతో.. ఎంతగానో అనుకున్న సీఎం జగన్ మాత్రం చివరకు రెండో ఓటు వేయాల్సి వచ్చింది. మనం ఎంత అనుకున్నా.. కొన్నిసార్లు అందుకు భిన్నంగా జరుగుతుందన్న దానికి నిదర్శనంగా ఈ ఉదంతాన్ని నేతలు చెప్పుకోవటం కనిపించింది.