Begin typing your search above and press return to search.

కొంప ముంచిన అత్యాశ.. వైనాట్ 175ను వదిలేయాల్సిందేనా?

By:  Tupaki Desk   |   24 March 2023 4:00 PM GMT
కొంప ముంచిన అత్యాశ.. వైనాట్ 175ను వదిలేయాల్సిందేనా?
X
ఆశ ఉండాలి. అదేం తప్పు కాదు. ఆశకు అత్యాశ తోడైతేనే ఇబ్బంది. ఇప్పుడు అలాంటి తీరుతోనే ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది ఏపీ అధికారపక్షం. అవసరానికి మించిన బలం.. బలగం వెంట ఉన్న వేళ.. ప్రజల్లో తమకు మించి మరెవరికీ ఆదరణ లేదన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు నోట మాట రాకుండా చేస్తుందని చెబుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి దెబ్బ తిని.. బోర్లా పడిన జగన్ కు ఇప్పుడు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యే అవకాశం ఉందంటున్నారు.

అన్ని సీట్లలో తామే గెలవాలి. చట్టసభల్లో తాము తప్పించి మరెవరూ ఉండకూడదన్నట్లుగా ఆలోచిస్తున్న తీరే జగన్ కు దెబ్బ పడేలా చేసిందంటున్నారు. గడిచిన కొంతకాలంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి.. ఇతర వైసీపీ నేతల నోటి నుంచి వవస్తున్న మాట ‘వై నాట్ 175’. ఏపీ అసెంబ్లీలో ఉన్న 175 స్థానాల్లోనూ అధికార వైసీపీ సొంతం చేసుకుంటుందన్న ధీమాను ముఖ్యమంత్రి అదే పనిగా వ్యక్తం చేయటం.. దానికి తగ్గట్లే వైసీపీ నేతలు సైతం అధినేత బాటలో నడుస్తూ బడాయి మాటలు చెప్పుకునే ధోరణి ఎక్కువైంది.

ఇలాంటి తీరు ప్రజల్లో అధికార పార్టీపై ఆగ్రహానికి గురయ్యేలా చేస్తుందంటున్నారు. ఇచ్చిన బంపర్ మెజార్టీని అందిపుచ్చుకొని.. బాధ్యతగా పని చేస్తే.. ఫలితం దానంతట అదే వస్తుందని.. అందుకు భిన్నంగా నిద్ర లేచింది మొదలు ప్రత్యర్థి పార్టీలను వేటాడే తీరు ప్రజల్లో మండిపాటువ్యక్తమవుతుందని చెబుతున్నారు. ఇదే సీఎం జగన్ కు ఎదురుదెబ్బగా మారిందంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో అనూహ్య ఓటమి ఎదురైన వేళ.. పలువురి నోటి నుంచి వస్తున్న ఒక మాట జగన్ అండ్ కోకు చిరాకు తెప్పిస్తుందని చెబుతున్నారు.

2024లోజరిగే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పే జగన్.. అందుకు తగ్గట్లే.. వైనాట్ 175 మాటను అదే పనిగా ప్రస్తావించటం తెలిసిందే. తాజాగా వెలువడిన ఫలితాల నేపథ్యంలో వైనాట్ 175 అన్న మాటను ఇప్పుడు చెప్పగలరా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఈ తీరు వైసీపీ నేతలకు మంట పుట్టేలా మారిందని చెప్పొచ్చు. ఓటమి వేదనకు మించి.. వైనాట్ 175 మాట మరింత మంట పుట్టేలా చేస్తుందంటున్నారు. తాజా పరిస్థితి చూస్తే.. మొగుడు కొట్టినందుకు కాదంట.. తోటికోడలు నవ్వినందుకట అన్న సామెత గుర్తుకు రాక మానదు. ఓటమి వేదన కంటే కూడా వైనాట్ 175 మాటతో జగన్ అండ్ కో కు మంటపుట్టేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది.