Begin typing your search above and press return to search.

తీవ్ర వత్తిడిలో జగన్...కనిపెట్టింది ఎవరంటే...?

By:  Tupaki Desk   |   29 Jan 2023 2:04 PM GMT
తీవ్ర వత్తిడిలో జగన్...కనిపెట్టింది ఎవరంటే...?
X
ముఖ్యమంత్రి జగన్ తీవ్ర వత్తిడిలో ఉన్నారా. ఇది నిజమేనా అంటే అవును అంటున్నారు ఆ పెద్దాయన. సరే ఆ పెద్దాయనకు ఎలా తెలిసింది అన్నది పక్కన పెడితే సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారికి వత్తిడి ఎక్కువగా ఉంటుంది. జగన్ సీఎం మాత్రమే కాదు పార్టీ ప్రెసిడెంట్ కూడా. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించిన వేళ ఆయన జోడు గుర్రం స్వారీ చేస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి గెలిపించుకోవడానికి చాలా ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది.

మరి అలా కనుక చూసుకుంటే వత్తిడి జగన్ కి ఉండకుండా ఉంటుందా. కానీ ప్రస్తుతం జగన్ ఎదుర్కొంటున్న వత్తిడి అలాంటిది కాదు ఇంకా తీవ్రంగా వేరే విషయం మీద అని అంటున్నారు అపర చాణక్యుడు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబునాయుడు. జగన్ లో పెద్ద ఎత్తున వత్తిడి ఉందని చంద్రబాబు కనిపెట్టేశారు. ఆ వత్తిడి ఎందుకు అన్నది కూడా కారణం సైతం కనిపెట్టేశారు.

ఏపీలో సీబీఐ మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పిలిచి నాలుగున్నర గంటల పాటు విచారించిందని, దాంతో జగన్ లో వత్తిడి పెరిగిపోయిందని చంద్రబాబు అంటున్నారు. జగన్ ఈ విషయం మీదనే మధన పడుతూ ఉన్నారని కూడా సెటైర్లు వేశారు.

తన సొంత బాబాయి ని చంపిన హంతకులను ఎలా రక్షించాలి అన్న దాని మీదనే జగన్ ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారు తప్ప ఏపీ అభివృద్ధి మీద ఆయన దృష్తి సారించడంలేదని చంద్రబాబు విమర్సించారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఏపీని సర్వనాశనం చేశారని ఆయన జగన్ని పట్టుకుని నిందించారు. ఏపీ ప్రగతి గతి దారుణంగా పడిపోయిందని, ఏ వైపు చూసినా నిరాశగా ఉందని, అభివృద్ధి శూన్యమని అంటున్నారు.

అయితే ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాల్సిన సీఎం తన సొంత రాజకీయం కోసం, సొంత లాభం కోసం ఆలోచిస్తూ ఉండడమే బాధాకరం అన్నారు. మరి జగన్ తీవ్ర వత్తిడిలో ఎందుకు ఉండాలి. సీబీఐ కడప ఎంపీని విచారణకు పిలిస్తే జగన్ ఇ ఎందుకు వత్తిడి అన్నది కనుక ఆలోచిస్తే చంద్రబాబు చెబుతున్న ప్రకారం ఈ హత్య కేసులో కడప ఎంపీ అనుమానితుడుగా ఉన్నారని, కీలక పరిణామాలు సీబీఐ పూర్తి విచారణ తరువాత చోటు చేసుకుంటాయని అంచనా కడుతున్నారు అంటున్నారు.

మరి తనకు ఏ తప్పు తెలియదు అని కడప ఎంపీ అంటున్నారు. పైగా తన మీద విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శిస్తున్నారు. అసలు నిజాలు బయటకు రావాలని ఆయన కోరుతున్నారు. మరి తమ నాయకుడు కడిగిన ముత్యంలా వస్తారు అని వైసీపీ నేతలు అంటూంటే జగన్ కి ఆ పాటి నమ్మకం లేదా లేక జస్ట్ సీబీఐ తన సోదరుడు కడప ఎంపీని విచారణకు పిలిస్తేనే టెన్షన్ లో పడే సీన్ ఉంటుందా అన్నదే చర్చ.

మొత్తానికి వివేకా హత్య కేసుకూ వైఎస్సార్ సొంత కుటుంబానికి ముడివేస్తూ సొంత వారే బాబాయి ని చంపించారు అని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు ఇపుడు అవినాష్ విచారణకు జగన్ తీవ్ర వత్తిడి అంటూ లింక్ పెట్టి కామెంట్స్ చేస్తున్నారు అని అంటున్నారు.

అయితే వరసబెట్టి రెండు రోజుల పాటు అనేక కార్యక్రమాలను జగన్ రద్దు చేసుకున్నారు. ఆయన ఢిల్లీ టూర్ వెళ్లాలనుకుంటున్నారు. వీటిని అన్నీ కలిసి టీడీపీ అనుకూల మీడియా అవినాష్ విచారణకు జగన్ టూర్ల రద్దుకు ముడిపెట్టి వార్తలు రాసింది. చంద్రబాబు కూడా దాన్ని చూసే మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తమకు వైఎస్ వివేకా హత్య విషయంలో అనుమానాలు ఉంటే సీబీఐకి ఎందుకు అప్పగిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. వాస్తవాలు బయటకు రావాలన్నదే తమ కోరిక అంటున్నారు. మొత్తానికి జగన్ మీద కొత్త ఆరోపణలు చంద్రబాబు చేశారని అంటున్నారు.