జగన్ కొత్త వ్యూహం? 2019 భిన్నంగా 2024లో రివర్స్ సోషల్ ఇంజనీరింగ్?

Sun Sep 25 2022 09:47:12 GMT+0530 (India Standard Time)

AP CM Ys Jagan Mohan Reddy

నలుగురు నడిచే దారిలో నడిస్తే ప్రత్యేకత ఏముంది? అన్నట్లు ఉంటుంది ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు. ప్రతికూలతల్ని సానుకూలతలుగా మార్చుకోవటంలోజగన్ కు మించినోళ్లు లేరనే మాట తరుచూ వినిపిస్తూ ఉంటుంది. ఇందుకు తగ్గట్లే ఆయన ఆలోచనలు.. వ్యూహాలు ఉంటాయని చెప్పాలి. 2014లో అనూహ్య ఓటమి నేపథ్యంలో.. 2019లో పక్కా వ్యూహంతో చంద్రబాబుకు దారుణ పరాజయాన్ని పరిచయం చేయటమే కాదు.. ఆయన్ను దెబ్బ తీయటానికి అవకాశం ఉన్న ఏ చిన్న అంశాన్ని విడిచిపెట్టని వైనం జగన్ సొంతం.అంతేకాదు.. ఒకసారి తన అస్త్రంగా పనికొచ్చిన వ్యూహాన్ని.. తర్వాతి ఎన్నికల్లో అందుకు భిన్నమైన అస్త్రాల్ని తెర మీదకు తీసుకొచ్చే టాలెంట్ జగన్ సొంతం. అదెంతలా అంటే.. తాను ఫాలో అయి చారిత్రక విజయాన్ని అందించిన వ్యూహానికి పూర్తి వ్యతిరేక వ్యూహానికి పదును పెడుతున్న తీరు చూస్తే.. ఔరా జగన్ అనుకోకుండా ఉండలేం. 2019లో బంపర్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 2019 ఎన్నికల వేళలో ఆయన అనుసరించిన  సోషల్ ఇంజనీరింగ్ ఎంతటి సక్సెస్ ను అందించిందో తెలిసిందే.

మరి.. అంతటి విజయాన్ని అందించిన వ్యూహానికి భిన్నమైన రివర్సు సోషల్ ఇంజనీరింగ్ ను ఆయన తెర మీదకు తెస్తున్నారా? అంటే.. తాజాగా ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు ఇదే విషయాన్ని ఖరారు చేస్తున్నాయి. ఇంతకీ జగన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ అంటే.. జనరల్ సీట్లను బీసీలకు కేటాయించటం.. కుల జనాభాతో సంబంధం లేకుండా గెలుపే లక్ష్యమన్న రీతిలో ఆయన టికెట్లు కేటాయించారు. దీనికితోడు.. వాతావరణం తనకు అనుకూలంగా ఉన్న విషయాన్ని గుర్తించి.. కొత్త ముఖాలకు అవకాశాలు ఇవ్వటం ద్వారా.. తనకు మించిన తోపు మరెవరూ లేని రీతిలో పార్టీని సిద్ధం చేశారు.

ఈ వ్యూహం 2019లో వర్కువుట్ కాగా.. 2024లో అందుకు భిన్నమైన వ్యూహానికి తెర తీస్తున్నారన్న మాట వినిపిస్తోంది. గతానికి భిన్నంగా రాబోయే ఎన్నికల్లో జగన్ రివర్స్ ఇంజనీరింగ్ కు అత్యధికప్రాధాన్యతను ఇవ్వనున్నారని చెబుతున్నారు. ఈ మాటలకు నిదర్శనంగా.. రెండు రోజుల క్రితం (శుక్రవారం) కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభను చెప్పాలి. ఆ సభలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఆయన కొత్త వ్యూహం ఇట్టే అర్థమైపోతుంది.

కుల సమీకరణల ఆధారంగా టికెట్లు ఇవ్వటం.. స్థానికత అస్త్రాన్నిబయటకు తీయటం కనిపించింది. కుప్పంలో అత్యధికులు బీసీలు ఉన్నప్పుడు.. వారి చేతిలో రాజ్యాధికారం లేకపోవటం ఏమిటి? అన్న ప్రశ్నను ఆయన సంధించారు. అదే సమయంలో చంద్రబాబు లోకల్ ఎలా అవుతారు? కుప్పంలో ఇల్లు లేకుండా హైదరాబాద్ లో ఇల్లు ఉండే ఆయన స్థానికుడెలా? అన్న సందేహాన్ని వ్యక్తం చేసిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తన నోటి నుంచి వచ్చే ఏ మాటకు భావోద్వేగం చటుక్కున చుట్టుకుంటుందో.. ఆ మాటల్ని ఏరి కోరి మరీ బయటకు తీసినట్లుగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పాలి. మొత్తంగా స్థానికులకే టికెట్లు ఇవ్వాలన్నట్లుగా ఆయన వాదన వినిపిస్తోంది. 2019లో ఆయనకు అధికారాన్ని అందించిన సోషల్ ఇంజనీరింగ్ కు పూర్తి విరుద్ధమైన రివర్స్ సోషల్ ఇంజనీరింగ్ వ్యూహం 2024 ఎన్నికల్లో ఏమేరకు వర్కువుట్ అవుతుందో కాలమే సరైన సమాధానం ఇవ్వగలదు.