Begin typing your search above and press return to search.

జగన్ పాలనలో దళితులు రగులుతున్నారా? ఎంతవరకు నిజం?

By:  Tupaki Desk   |   27 May 2022 3:56 AM GMT
జగన్ పాలనలో దళితులు రగులుతున్నారా? ఎంతవరకు నిజం?
X
కులాల కుంపట్లకు కేరాఫ్ అడ్రస్ గా ఏపీని చెబుతారు. రెండు తెలుగు రాష్ట్రాల్ని చూస్తే.. ఏపీలో ఉన్నంత కులాల కంపు తెలంగాణలో కనిపించదు. ఏపీలోనూ అందునా కోస్తా ప్రాంతంలో కులాలకు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కొత్తవారు పరిచయమైన పావు గంటలోనే.. ఎదుటోడి కులం గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత కనిపిస్తూ ఉంటుంది. అలాంటి తీరు తెలుగు నేల మీద మరెక్కడా కనిపించదు. తాజాగా భగ్గుమన్న కోనసీమ ఎపిసోడ్ వెనుక కులాల కుమ్ములాటలో భాగంగానే హింసాత్మక చర్యలు చోటు చేసుకున్నట్లుగా చెప్పటం తెలిసిందే.

కోనసీమ జిల్లాకు ముందు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరును పెట్టాలని నిర్ణయించటం.. అందుకు తగ్గట్లు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయటం తెలిసిందే. దీనిపై రగిలిన కొందరు ఆందోళన పేరుతో నిర్వహించిన నిరసన భారీ హింసాకాండకు కారణమైంది. అనంతరం దీనికి బాధ్యులు మీరంటే.. మీరే అంటూ ఆరోపించుకోవటం ఎక్కువైంది. ఎప్పటిలానే విపక్షాల మీద అధికార పార్టీ ఆరోపణల్ని సంధించింది. అయితే.. ఈ ఉదంతంలో తమకు ఎలాంటి సంబంధం లేదని.. నిజానికి ఈ మొత్తం రచ్చకు కారణం అధికార పార్టీనే అంటూ వాదనలు వినిపించటమే కాదు.. అందుకు తగ్గట్లుగా కొన్ని సాక్ష్యాల్ని తెర మీదకు తీసుకొచ్చారు.

ఇంతకీ ఇలాంటి పనులు వైసీపీ ఎందుకు చేస్తుందన్న దానికి.. వారు వినిపిస్తున్న వాదన ఇప్పుడు కొత్తగా ఉంది. అదేమంటే.. ఏపీ సర్కారుకు దన్నుగా ఉంటారని భావించే దళితులు మూడేళ్ల జగన్ పాలనలో దూరం అయ్యారని.. వారందరిని సంఘటితం చేసే పనిలో భాగంగానే ఇలాంటి పని చేసినట్లుగా చెబుతున్నారు. వైసీపీ నుంచి దళితులు దూరం కావాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చిందన్న వెంటనే పెద్ద చిట్టానే విప్పుతున్నారు. అవేమిటో చూస్తే..

- వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీలకు దక్కాల్సిన సంక్షేమ పథకాల నిలిపివేత
- బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌.. అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకం రద్దు
- ఏపీ స్టడీ సర్కిల్‌, అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌కు నిధులు నిలిపివేయటం
- మెడికల్ సీట్ల భర్తీలో బీ.. సీ కేటగిరీ సీట్లకు రిజర్వేషన్లు వర్తింపచేయకపోవటం
- ఎస్సీ.. ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రుణాల మంజూరు నిలిపివేయటం
- ఎస్పీ కార్పొరేషన్ ను మూడు ముక్కలు చేసి నిధులు ఇవ్వకపోవటం
- కులాంతర వివాహాల ప్రోత్సాహాలను.. కల్యాణ కానుకరద్దు
- స్టాండప్ ఇండియా ద్వారా ఎస్సీ.. ఎస్టీలకు ఇచ్చే రుణాలకు కేంద్ర పథకాల అమలు నిలిపివేత
- ఎస్సీ.. ఎస్టీ బ్యాక్ లాక్ పోస్టుల భర్తీ ఆపేయటం
- సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు
- ఇళ్ల స్థలాల పేరుతో 11 వేల ఎకరాల అసైన్డ్ భూమిని ఎస్సీ.. ఎస్టీల నుంచి వెనక్కి తీసుకోవటం
- ఇళ్ల స్థలాల్ని వెనక్కి తీసుకున్న వారికి చెల్లించాల్సిన పరిహారం పలువురికి ఇప్పటికి చెల్లించకపోవటం

ఇలా దళిత వర్గానికి చెందిన వారికి ఇబ్బందులు కలిగించే నిర్ణయాల్ని ప్రభుత్వం తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. ఎస్సీల ఇళ్లపై దాడులు ఎక్కువైనట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు డాక్టర్ సుధాకర్ ఉదంతం మొదలు.. ఇటీవల దళిత మహిళ వెంకాయమ్మ వరకు జరిగిన దాడులు కూడా ఆ వర్గంలోని వారిని ప్రభావితం చేసినట్లు చెబుతున్నారు. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ అనంత చేతిలో హత్యకు గురైన సుబ్రహ్మణ్యం సైతం దళితుడే. ఇలా వరుస పెట్టి చోటు చేసుకుంటున్న పరిణామాల నుంచి దృష్టి మరల్చే కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా పేరు ముందు అంబేడ్కర్ పేరును పెట్టటం ద్వారా రాజకీయ లబ్థి పొందాలని చూస్తున్నారంటున్నారు. ఈ వాదనను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. చూస్తుంటే.. మరిన్ని రోజులు కోనసీమ హింసాకాండ ఏపీ రాజకీయాల్ని ప్రభావితం చేస్తుందని మాత్రం చెప్పక తప్పదు.