ఏసీబీ చీఫ్ గా ఏబీ!..బాబు ప్రమేయం లేదు!

Mon Apr 22 2019 18:19:39 GMT+0530 (IST)

AB Venkateswara rao appointed as new ACB chief of Andhra

ఏపీలో జరిగిన ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం పక్కనపెట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారి - నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఇప్పుడు ఏపీలోనే కీలక పదవి దక్కింది. ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల నుంచి ఏబీని తొలగిస్తూ నాడు ఈసీ తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు సర్కారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటుగా ఏకంగా ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టునూ ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో ఈసీకి ఉన్న విచక్షణాధికారాలను ప్రశ్నించలేమన్న కోర్టు వాదనతో చంద్రబాబు సర్కారు వెనక్కు తగ్గింది. తాజాగా చంద్రబాబు ప్రమేయం లేకుండానే ఏబీకి కీలక పోస్టింగ్ దక్కింది. ఈ మేరకు ఏబీని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చీఫ్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు.పోలింగ్ ముగిసినా... ఇంకా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 23న జరగనున్న కౌంటింగ్ ముగిసిన తర్వాత గానీ ఎన్నికల కోడ్ ముగియదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేని పోస్టులో ఏబీని నియమించాలని గతంలోనే జారీ చేసిన ఈసీ ఆదేశాలకు అనుగుణంగానే ఇప్పుడు ఆయనను ఏసీబీ చీఫ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కారణంగానే ఏబీపై విపక్ష వైసీపీ ఈసీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసింది. అయితే ఇప్పుడు ఏబీకి కీలక పదవి దక్కడంలో మాత్రం చంద్రబాబు అండ్ కోకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలి.