Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై జాతీయ మహిళా కమిషన్ కు మహిళ ఫిర్యాదు

By:  Tupaki Desk   |   30 May 2023 1:00 PM GMT
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై జాతీయ మహిళా కమిషన్ కు మహిళ ఫిర్యాదు
X
వేధింపులకు, బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యే పై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు)కి ఓ ప్రైవేట్ డెయిరీ ఫామ్‌లోని కోడైరెక్టర్ అయిన మహిళ ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై ఆమె ఫిర్యాదు చేశారు.

ఓ వీడియో స్టేట్‌మెంట్‌లో ఈ మేరకు వివరించారు. ఆరిజిన్ డెయిరీ కో డైరెక్టర్ గా పనిచేస్తున్న ఓ మహిళ.. తమకు ఎమ్మెల్యే నుండి ప్రాణహాని ఉందని, తెలంగాణ పోలీసులు తమ ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించామని చెప్పారు.

ఎమ్మెల్యే తన మద్దతుదారుల ద్వారా బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలని ఆమె కోరారు., మాకు న్యాయం చేస్తామని కమిషన్ హామీ ఇచ్చిందన్నారు.

ఎమ్మెల్యేపై తొలిసారిగా మార్చిలో లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు సహకరించినందుకు ప్రతిఫలంగా తన వద్దకు మహిళలను పంపాలని ఎమ్మెల్యే కోరినట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు భూకేటాయింపులో తమకు సాయం చేయలేదని, లంచం తీసుకున్నా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ప్రైవేట్ డెయిరీ యాజమాన్యం ఆరోపించింది.

సోషల్ మీడియాలో ప్రసారమైన ఆడియో క్లిప్‌లో, డెయిరీ భాగస్వామి వ్యక్తి ఎమ్మెల్యేకు మధ్య సంభాషణ వివాదం అయ్యింది. అమ్మాయిలను పంపాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేసినట్టు ఆడియోలో ఉంది.

అనంతరం బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి నిరసన తెలిపితే తమను అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు. పోలీసులు తమను మూడు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారని, ఆ తర్వాత వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారని ఆమె చెప్పారు.

తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశారు.

డెయిరీ పేరుతో రైతులను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని, అందుకే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని చిన్నయ్య తెలిపారు.