Begin typing your search above and press return to search.

కరోనా ఎపిసోడ్ లో భారత్ లో తొలిసారి అలాంటి సీన్

By:  Tupaki Desk   |   5 Aug 2020 5:36 PM GMT
కరోనా ఎపిసోడ్ లో భారత్ లో తొలిసారి అలాంటి సీన్
X
కళ్లాల్లేని గుర్రాల మాదిరి కరోనా కేసులు అదే పనిగా దేశంలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. రోజుకు యాభై వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదు అవుతున్న వేళ.. కరోనా భయం అంతకంతకూ పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కేసుల పెరుగుతున్న తీరు కొత్త టెన్షన్ గా మారాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఇప్పటివరకూ ఎప్పుడూ లేని కొత్త సీన్ ఒకటి ఈ రోజు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. దేశంలో ఒక్కరోజులో కరోనా పేషెంట్లు పెద్ద ఎత్తున డిశ్చార్జి అయిన రికార్డు మంగళవారం నమోదైంది.

దేశంలో ఇప్పటివరకు 19.08 లక్షల మంది కరోనా పాజిటివ్ గా నమోదయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 12.82 లక్షల మంది కరోనా జయించి డిశ్చార్జి అయ్యారు. 39,795 మంది మరణించారు. ప్రస్తుతం 5.86 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు ప్రత్యేకత ఏమంటే.. ఇప్పటివరకు ఒక్కరోజులో కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో ఉండటం గమనార్హం.

తాజాగా మంగళవారం ఒక్కరోజే 51,706 మంది డిశ్చార్జి అయినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇంత భారీ ఎత్తున డిశ్చార్జి కావటం ఇదే తొలిసారి. గడిచిన పద్నాలుగు రోజుల్లో కోలుకొని డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య అంతకంతకూ మెరుగుపడుతోంది. గతంలో ఉన్న 63 శాతం నుంచి 67 శాతానికి పెరగటం గమనార్హం. ప్రస్తుతం రికవరీ రేటు 67.19 శాతం ఉంటే.. మరణాలు రేటు 2.09శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 30.72 శాతంగా నమోదవుతున్నాయి.

రోజురోజుకీ శాంపిళ్లు సేకరిస్తున్న సంఖ్య కూడా పెంచుతున్నారు. మంగళవారం ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా 6.19 లక్షల శాంపిళ్లు పరీక్షించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ పరీక్షించిన శాంపిళ్లు 2.14 కోట్లకు చేరాయి. రానున్న రోజుల్లో రికవరీ శాతం మరింత పెరిగితే.. పరిస్థితులు మరింత మెరుగపడే పరిస్థితులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు.