Begin typing your search above and press return to search.

ఏపీ పాలిటిక్స్ లో అరుదైన సీన్..నారాయణకు కట్టు కట్టిన వైసీపీ ఎంపీ

By:  Tupaki Desk   |   24 Nov 2021 1:11 PM GMT
ఏపీ పాలిటిక్స్ లో అరుదైన సీన్..నారాయణకు కట్టు కట్టిన వైసీపీ ఎంపీ
X
ఆసక్తికర రాజకీయ సన్నివేశానికి వేదికగా నిలిచింది ఆంధ్రప్రదేశ్. నిజానికి ఈ సీన్ కు సంబంధించిన వార్తను కాస్తంత ప్రముఖంగా మీడియాలో రావాల్సి ఉంది. ఎందుకంటే.. రాజకీయాలు అన్నంతనే చెవులు మూసుకునేంత దారుణంగా తిట్టిపోయటం.. ఇష్టమొచ్చినట్లుగా విరుచుకుపడటం.. అవసరమైతే భౌతిక దాడులకు సైతం వెనుకాడనట్లుగా ఉండటం మాత్రమే చూస్తున్న రోజుల్లో.. అందుకు భిన్నంగా చోటు చేసుకున్న ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఎంతటి దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయో తెలిసిందే. ఆ ప్రాంతాల్ని సందర్శించి.. అక్కడి ప్రజలకు ఎదురైన ఇబ్బందులు.. ప్రభుత్వం నుంచి జరుగుతున్న తప్పుల్ని తెలుసుకొని.. తాట తీసేందుకు వీలుగా సీపీఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె. నారాయణ పర్యటిస్తున్నారు. పార్టీ నేతలతో కలిసి పలు ప్రాంతాల్ని పరిశీలించిన ఆయన.. తిరుపతి రాయల చెరువును పరిశీలించారు.

ముంపు ప్రాంతాల్ని పరిశీలించేందుకు రామచంద్రపురం మండలం కుప్పం బాదూరుకు చేరుకున్నారు. అనంతరంఅక్కడి కొండను ఎక్కి.. ముంపుప్రాంతాల్ని పరిశీలించే ప్రయత్నం చేశారు. దాదాపు కిలోమీటరు మేర నడుచుకుంటూ రాయల చెరువు కట్ట వద్దకు చేరుకున్నారు. కిందకు దిగే వేళలో.. నారాయణ కాలు అనూహ్యంగా బెణికింది. వెంటనే వాపు రావటం.. నొప్పి ఎక్కువగా ఉండటంతో ఆయన అడుగు వేయలేని పరిస్థితి. దీంతో.. ఆయన అక్కడే కూర్చుండిపోయారు.

ఇదే సమయంలో చెరువు కట్టను పరిశీలించేందుకు వైసీపీ నేతల టీం అక్కడకు వచ్చింది. వారిలో ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తదితరులు వచ్చారు. నారాయణనుచూసి పలుకరించారు. ఆయన పడుతున్న బాధను అర్థం చేసుకున్న వెంటనే.. తిరుపతి ఎంపీ గురుమూర్తి తనలోని డాక్టర్ ను బయటకు తీశారు. వెంటనే వైద్యుడిగా మారిన ఆయన నారాయణ కాలికి అయిన గాయాన్ని పరిశీలించారు. ప్రాథమిక చికిత్స చేసి.. తాత్కాలిక కట్టు కట్టారు. తమ వాహనంలోనే వైసీపీ నేతలు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

వాస్తవానికి అధికార పార్టీ తప్పుల్ని ఎత్తి చూపటానికి వచ్చిన నారాయణను.. రాజకీయ శత్రువుగా చూడకుండా.. కష్టంలో ఉన్న విషయాన్ని గుర్తించి.. ఆయనకు చేయాల్సిన సాయం చేయటమే కాదు.. తమ వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లిన వైనం చూస్తే.. రాజకీయాల్లో తిట్లు మాత్రమే కాదు.. అంతకు మించిన ఇలాంటి సీన్లు ఉంటాయన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏమైనా.. వైసీపీ ఎంపీ స్పందించిన తీరును పలువురు అభినందిస్తున్నారు.