Begin typing your search above and press return to search.

దేవుళ్ల బొమ్మ‌లు ఉన్న పేప‌ర్ లో చికెన్ అమ్ముతున్న వ్య‌క్తి అరెస్టు!

By:  Tupaki Desk   |   6 July 2022 6:08 AM GMT
దేవుళ్ల బొమ్మ‌లు ఉన్న పేప‌ర్ లో చికెన్ అమ్ముతున్న వ్య‌క్తి అరెస్టు!
X
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని సంభాల్ లో దేవుళ్ల బొమ్మ‌లు ఉన్న న్యూస్ పేప‌రులో ప్యాక్ చేసి చికెన్ అమ్ముతున్నారంటూ వేరే వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో పోలీసులు అత‌డిపై దాడి చేశార‌నే ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపాయి.

సంభాల్ లోని ఒక రెస్టారెంటులో దేవుళ్ల బొమ్మలు ఉండే సుమారు 100 న్యూస్ పేపర్లను, చికెన్ ప్యాకింగ్ కోసం ఉపయోగిస్తున్నార‌ని... దీని మీద చర్యలు తీసుకోవాలి అని కోరుతూ ఒక నెటిజ‌న్ ట్విట్ట‌రులో సంభాల్ పోలీసులను ట్యాగ్ చేశాడు.

బీజేపీ బ‌హిష్కృత నేత నుపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల‌తో దేశం సున్నిత ప‌రిస్థితుల్లో ఉండ‌టంతో ఎలాంటి వివాదాలు త‌లెత్త‌కుండా పోలీసులు త‌క్ష‌ణ‌మే నిందితుడిని అరెస్టు చేశారు. ప‌లు సెక్ష‌న్ల కింద అత‌డిపై కేసు న‌మోదు చేశారు.

పోలీసులు ఆ రెస్టారెంటును సంద‌ర్శించిన‌ప్పుడు అక్క‌డ‌ ఒక మ‌తానికి చెందిన దేవ‌త‌ల ఫొటోలు ముద్రించిన న్యూస్ పేప‌ర్లు ల‌భించాయి. ఆ పేప‌ర్ల‌లో చికెన్ ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని రెస్టారెంట్ య‌జ‌మానిని ప్ర‌శ్నిస్తే పోలీసుల‌పై క‌త్తితో దాడికి ప్ర‌య‌త్నించాడ‌ని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

153ఏ(విద్వేషాలు రెచ్చగొట్టడం), 295ఏ(మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించడం), 307(హత్యకు ప్రయత్నించడం) సెక్షన్ల కింద రెస్టారెంట్ య‌జ‌మాని మీద కేసులు పెట్టారు. మ‌రోవైపు త‌న తండ్రిని కావాల‌నే కేసులో ఇరికించార‌ని య‌జ‌మాని కుమారుడు చెబుతున్నాడు.

తాము మార్కెట్ నుంచి కొనుక్కుని వ‌చ్చిన‌ పాత న్యూస్ పేప‌ర్ల‌నే వాడామ‌ని.. ఆ పేప‌ర్ల‌పై తాము దేవ‌త‌ల ఫొటోలు చిత్రీక‌రించ‌లేద‌ని అత‌డు అంటున్నాడు. పోలీసులు మాత్రం త‌న తండ్రిని త‌ప్పు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. తాము 25 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నామ‌ని.. వేరే వాళ్ల మ‌త విశ్వాసాల‌ను దెబ్బ‌తీయ‌బోమ‌ని చెబుతున్నాడు.