ఒక అధ్యయన ఫలితం ఆశ్చర్యపోయేలా చేయటమే కాదు.. ఇద్దరి మధ్య ఉండే బంధంలో ఇలాంటి కోణం కూడా ఉంటుందా? అనిపించక మానదు. భార్యభర్తలు కావొచ్చు.. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం కావొచ్చు. రిలేషన్ ఏదైనా కావొచ్చు కానీ.. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా కలిసి ఉండే వారికి సంబంధించిన ఈ కొత్త విషయం వావ్ అనుకునేలా చేయటం ఖాయం. తాజాగా ఇలినాయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఓగోస్కీ అనే పెద్దాయన ఒక పరిశోధనను చేపట్టారు.
ఇద్దరు
మనుషుల మధ్య బంధం ఎంత బలమైనదన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేశారు.
ఇందులో భాగంగా వారు చేపట్టిన పరిశోధనలో ఆశ్చర్యానికి గురి చేసే ఫలితాలు
వెల్లడయ్యాయి. ఇష్టమైన వారు.. ప్రాణానికి ప్రాణంగా భావించే వారు దగ్గరకు
వస్తున్న కొద్దీ గుండె వేగంగా కొట్టుకోవటం సినిమాల్లో తరచూ చూస్తుంటాం.
వాస్తవానికి ఇలాంటి ఫీలింగ్ చాలా మంది అనుభవించి ఉంటారు. సరిగ్గా ఇదే విషయం
మీద ఫోకస్ చేసిన పరిశోధకులకు కొత్త విషయాల్ని గుర్తించారు.
దీనికి
సంబంధించిన వివరాల్ని ఇటీవల పబ్లిష్ అయిన ‘సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్
షిప్స్’ జర్నలో ప్రచురించారు. దీని ప్రకారం ఎక్కువ కాలం రిలేషన్ లో ఉన్న
కొన్ని జంటల్ని తీసుకొని.. వారి మధ్య దూరం.. వారిద్దరి గుండె చప్పుడును
లెక్క వేశారు. 64 ఏళ్ల నుంచి 88ఏళ్ల వయసు మధ్య ఉన్న వారిలో కనిష్ఠంగా 14
ఏళ్లు.. గరిష్ఠంగా 65 ఏళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్న పది జంటల్ని కేస్
స్టడీగా తీసుకొని రెండు వారాల పాటు పరీక్షించారు.
ఇలాంటి జంటలు
దూరంగా ఉన్నప్పుడు వారి గుండె ఒకలా కొట్టుకోవటం.. ఇద్దరు దగ్గరకు
వచ్చినప్పుడు మరోలా కొట్టుకోవటాన్ని గుర్తించారు. సింఫుల్ గా చెప్పాలంటే..
దూరంగా ఉన్నప్పటితో పోలిస్తే.. వారిద్దరు దగ్గరగా వచ్చినప్పుడు గుండె
కొట్టుకునే తీరులో తేడాను గుర్తించారు. అంటే.. ఇద్దరు దగ్గరగా ఉన్నప్పుడు
ఒకరి గుండెను మరొకరిని ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని వారు కనిపెట్టారు.
ఈ
పరిశోధనలో స్త్రీ.. పురుషుల్లో ఎవరు ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపారన్న
విషయాన్ని చూస్తే.. ఒక సారి భార్య గుండె భర్త గుండె మీద ప్రభావం చూపిస్తే..
మరికొన్ని సందర్భాల్లో భర్త గుండె భార్య గుండె మీద ప్రభావం చూపుతుందన్న
విషయం బయటకు వచ్చింది. ఇదంతా చూస్తే.. దీర్ఘకాలం ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా
జీవించే జంటల గుండెలు సైతం ఒకరి కోసం మరొకరు అన్నట్లుగా పని చేస్తుందన్న
విషయం తేలిందని చెప్పాలి. నిజంగా.. అద్భుతం కదూ?