మార్స్ మీద నడక మొదలైంది.. అద్భుతమైన ఫోటో వచ్చేసింది

Sat Mar 06 2021 12:40:52 GMT+0530 (IST)

A key step in NASA Mars mission

జీవితంలోనే కాదు.. రానున్న దశాబ్దాలల్లోనూ మనిషి వెళ్లలేని అంగారకుడి గ్రహం ఎలా ఉంటుంది? అక్కడి నేల ఎలా ఉంటుంది? దాని మీద ఒక వాహనం నడిస్తే ఏమవుతుంది? ఇలాంటి ఎన్నోప్రశ్నలకు ఇప్పుడిప్పుడే సమాధానాలు లభిస్తున్నాయి. జీవితకాలంలో వెళ్లలేని కోట్లాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి సంబంధించిన ఫోటోల్ని చూసే అవకాశాన్ని నాసా పుణ్యమా అని ప్రపంచం మొత్తం చూసే అవకాశం లభిస్తోంది. తాజాగా ఆ సంస్థ చేపట్టిన మార్సు మిషన్ లో భాగంగా.. కొత్త ఫోటోను విడుదల చేసింది.నాసా ప్రయోగించిన పర్సెవరెన్స్ మరో కీలక అడుగు వేసింది. అంగారకగ్రహం మీద తొలిసారి విజయవంతంగా టెస్టు డ్రైవ్ చేపట్టిన ఈ రోవర్.. 33 నిమిషాల వ్యవధిలో 6.5 మీటర్లు.. అంటే 21.3 అడుగుల దూరాన్ని నడిచింది. అంతేకాదు.. తన నడకలో భాగంగా 150 డిగ్రీల ఎడమవైపునకు తిరిగి వెనక్కి మరో 2.5 మీటర్లు ప్రయాణించింది. దీనికి సంబంధించి రోవర్ పంపిన ఫోటోల్లో ట్రాక్ జాడలు కొట్టొచ్చినట్లుగా కనిపించటమే కాదు.. తడి పొడి నేల మీద నడిచినట్లుగా ఉండటం గమనార్హం.

అంతరిక్షంలో.. అందునా ఒక గ్రహంలో నేలకు సంబంధించి ఇంత స్పష్టమైన ఫోటో ఇప్పటివరకు రాలేదని చెప్పాలి. అంగారకుడిపై రోవర్ ప్రయాణించిన తీరు అద్భుతమని.. రోవర్ చక్రాల్ని నడిపే తొలి అవకాశం తమకు లభించినట్లుగా నాసా వెల్లడించింది. ఈ మిషన్ లో కీలకంగా చెప్పింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. రానున్న రోజుల్లో మరికొన్ని దూర ప్రయాణాలు కూడా చేస్తామంటూ చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఆరంభంలోనే అదిరే ఫోటోల్ని అందించిన ఈ మిషన్.. రానున్న రోజుల్లో మరెన్ని అద్భుతమైన ఫోటోల్ని పంపుతుందో చూడాలి.