నాలుగేళ్ల బాలుడు బెయిల్ కోసం కోర్టుకు వచ్చాడు

Sat Mar 18 2023 09:59:32 GMT+0530 (India Standard Time)

A four Year old boy came to the court seeking bail

మన పోలీసుల తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది? వెనుకా ముందు చూసుకోకుండా కేసులు పెట్టేసే విషయంలో ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అన్న తేడా లేకుండా ఉండటం తెలిసిందే. అడ్డదిడ్డంగా వ్యవహరిస్తూ.. అందరిచేత తిట్లు తినేలా వ్యవహరించే ఉదంతాలు ఇప్పటికే చాలానే తెర మీదకు వచ్చాయి. ఆ కోవకు చెందిందే ఇప్పుడు చెప్పే ఉదంతం. తాజాగా నాలుగేళ్ల బాలుడు బెయిల్ కోసం కోర్టుకు వచ్చిన వైనం షాకింగ్ గా మారింది.పోలీసుల నిర్వాకానికి కోర్టు సైతం ఆశ్చర్యపోయిన వైనంగా దీన్ని చెప్పాలి. బిహార్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో.. నాలుగేళ్ల బాలుడు చేసిన తప్పేంటి? అతగాడి నేరం ఏమిటి? అన్న ప్రశ్నలు వేయటానికి ముందు.. ఆ పిల్లాడి మీద పెట్టిన కేసు.. వాడు రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు చేశాడని చెప్పటం ఈ మొత్తం ఎపిసోడ్ లోనే హైలెట్ గా చెప్పాలి. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

బిహార్ లోని బెగుసరాయ్ జిల్లాకు చెందిన ఒక బాలుడితో సహా మొత్తం ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అది కూడా 2021 ఏప్రిల్ లో. దానికి వారు చూపించిన కారణం ఏమంటే.. కొవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కొన్ని ప్రాంతాల్ని కంటైన్ మెంట్ చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా అప్పట్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే.. ఇలా ఏర్పాటు చేసిన బారికేడ్లను రెండేళ్ల వయసున్న బాలుడితో సహా మొత్తం ఎనిమిది మంది తొలగించారని.. దీని కారణంగా కొవిడ్ వ్యాప్తి చెందినట్లుగా ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.

దాదాపు రెండేళ్ల క్రితం పోలీసులు పెట్టిన కేసుకు సంబంధించిన విషయం తాజాగా తెలుసుకున్న ఆ బాలుడి తల్లి.. భయాందోళనతో జిల్లా కోర్టుకు వచ్చింది. తనతోపాటు తన నాలుగేళ్ల వయసున్న కొడుకును కోర్టుకు తీసుకొచ్చి.. తన పిల్లాడిని అరెస్టు చేయకుండా ఉండేందుకువీలుగా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. విషయం తెలిసి విస్మయానికి గురైంది.

చిన్నారిపై ఇలంటి కేసులు పెట్టటానికి.. బెయిల్ ఇవ్వటానికి ఎలాంటి నిబంధనలు లేవని స్పష్టం చేసింది బెగుసరాయ్ కోర్టు. అధికారుల తీరుపై మండిపడ్డ న్యాయస్థానం పిల్లాడిపై ఉన్న కేసును కొట్టేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.