Begin typing your search above and press return to search.

పులివెందుల వాలంటీర్ నిర్వాకం.. పింఛన్ పైసల కోసం మహా కక్కుర్తి

By:  Tupaki Desk   |   12 May 2022 7:46 AM GMT
పులివెందుల వాలంటీర్ నిర్వాకం.. పింఛన్ పైసల కోసం మహా కక్కుర్తి
X
కక్కుర్తి అన్న మాట తరచూ వింటాం కానీ.. తాజాగా వెలుగు చూసిన ఈ కక్కుర్తి గురించి తెలిస్తే మాత్రం నోట మాట రాకుండా పోవటం ఖాయం. అంతేనా.. చిల్లర డబ్బుల కోసం మరీ ఇంత దారుణానికి ఒడిగడతారా? అన్న గగుర్పాటుకు గురి కాక తప్పదు. ఇప్పటికే బంధాలు.. అనుబంధాల మీద కొత్త అనుమానాలు ముసురుతున్న వేళ వెలుగు చూసిన ఈ దారుణం చూస్తే.. ఎంత డబ్బుల కోసమైతే మాత్రం మరీ ఇంత నీచమా? అనుకోకుండా ఉండలేం.

అసలేం జరిగిందంటే..భర్త మరణించిన మహిళలకు వితంతు ఫించన్ ప్రభుత్వం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇంటి పెద్ద మరణిస్తే.. కుటుంబ భారం కష్టంగా మారుతుందన్న ఉద్దేశంతో వారికి కాస్తంత ఆదరవుగా ఉండేందుకు వీలుగా ఈ ఫించన్ ను ఇస్తున్నారు.

అయితే.. పులివెందులకు చెందిన మహిళా వాలంటీర్ కు భర్త బతికి ఉండగానే.. మరణించినట్లుగా పత్రాలు సిద్ధం చేస్తే.. ఫించన్ పొందొచ్చన్న దరిద్రపుగొట్టు ఆలోచన వచ్చింది.

తానే గ్రామ వాలంటీర్ కావటంతో వీఆర్వోతో కలిసి భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందింది. వితంతు పింఛన్ కు ప్రయత్నం చేసింది. అప్పటివరకు అంతా ఆమె అనుకున్నట్లు నడిచినప్పటికీ.. భార్య చేసిన పాడుపని గురించి తెలిసిన భర్త.. తాను బతికే ఉన్నానని సంక్షేమ పథకాల్ని ఇవ్వాలంటూ అధికారుల్ని మొరపెట్టుకున్నాడు. దీంతో.. ఈ గ్రామ వాలంటీర్ దుర్బుద్ది బయటకు వచ్చింది.

ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త.. తాను బతికే ఉన్నానని సంక్షేమ పథకాలు అందజేయాలని అధికారులకు మొర పెట్టుకున్నారు. తనకు.. తన భార్యకు కలిపి ఏడాది వయసున్న కొడుకు ఉన్నాడని.. మనస్పర్థల కారణంగా విడివిడిగా ఉన్నట్లుగా తెలిపాడు.

దాన్ని అసరాగా చేసుకున్న మహిళ.. భర్త మరణించినట్లుగా పత్రాల్ని తయారు చేసి వితంతు పింఛన్ పొందే ప్రయత్నం చేయటం.. ఆ విషయం భర్తకు తెలీటంతో ఆమె గుట్టురట్టైంది. దీంతో.. తన భార్య మీద చర్యలు తీసుకొని. తనకు న్యాయం చేయాలని బాధిత భర్త బళ్లారి సుభాహాన్ బాషా కోరుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.