కారు కాదు.. కమలమే.. ఈటల రాజేందర్ కు పెద్ద సమస్య!

Mon Jul 26 2021 23:00:01 GMT+0530 (IST)

A big problem for Eeta Rajender

టీఆర్ ఎస్ మాజీ నాయకుడు మాజీ మంత్రి.. ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నిక రానుంది. మంత్రి పదవి నుంచి తప్పించడం.తో హర్ట్ అయిన ఈటల.. వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే.. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో గెలిచి తీరాల్సిన అవసరం ఈటలకు ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ నుంచి ఆయన ఆరు సార్లు విజయం దక్కించుకున్నారు.అయితే.. ఈనాలుగు సార్లు కూడా ఆయన కారు గుర్తుపై టీఆర్ ఎస్ నుంచే పోటీ చేసి విజయం దక్కించు కున్నారు. కానీ ఇప్పుడు తొలిసారి ఆయన పార్టీ మారారు.. గుర్తు కూడా మారిపోయింది. ఇప్పుడు ఇదే ఈటలకు పెద్ద చిక్కుగా మారిందని.. ఇదే ప్రధాన సమస్యగా ఉందని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి కేసీఆరో.. కేటీఆరో.. లేక టీఆర్ ఎస్ నేతలతో ఇప్పుడు ఆయనకు సమస్యకాదని.. ఆయన ఉన్న పార్టీ..సింబల్ కమలమే.. ఈటలకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు పరిశీలకులు.

దీనికి కారణం ఏంటి? అంటే.. హుజూరాబాద్ లో ఈటల ఒకటి రెండు సార్లు కాదు.. ఏకంగా ఆరు సార్లు విజయం దక్కించుకున్నారు. ఈ హుజూరాబాద్‌లో ప్రతి గడప గడపకు ఈటల అంటే.. సుపరిచితులు. ప్రతి ఒక్కరితోనూ ఆయన ఎంతో అన్యోన్య సంబంధం ఉంది. ఇప్పటి వరకు ఆయనకు ఓటమి అన్నదే లేదు. అనేక గ్రామాలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రత్యర్తులకు ఈటల కొరకరాని కొయ్యగా మారారు. ఆయనను ఓడించడం అంటే.. అంత ఈజీకాదనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం.

ఈ విషయంలో అధికార టీఆర్ ఎస్ కూడా అతీతమేమీ కాదు. ఈ క్రమంలోనే ఈటలను ఎదుర్కొనేందుకు అనూహ్యంగా దళిత బంధు సహా.. అనేక పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా హుజూరాబాద్ కేంద్రంగా చక్రం తిప్పుతోంది. ఇక ఇప్పుడు తన హవాను మరింత పెంచుకునేందుకు ఈటల పాదయాత్ర కూడా చేస్తున్నారు. ప్రతి ఇంటికీ.. ప్రతి గ్రామాన్నీఆయన కవర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇది ఈటలకు ఎంతో కలిసి వస్తున్న అంశంగా ఉంది.

ఈ పాదయాత్రలో ఈటలను కలుస్తున్న ప్రతి ఒక్కరూ ఆయనకు గట్టి హామీనే ఇస్తున్నారు. తమ ఓట్లు ఆయనకేనని చెబుతున్నారు. అంతేకాదు.. చాలా ``మా ఓటు కారుకే`` అని చెబుతున్నారు. అంటే.. ఇంకా ఈటల టీఆర్ ఎస్‌లోనే ఉన్నారని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఈటలకు పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే.. దాదాపు దశాబ్దంనరగా ఆయన ప్రజలకు టీఆర్ ఎస్ నేతగానే పరిచయమయ్యారు. ఈ క్రమంలో ఆయన ఎన్నికల గుర్తు కూడా.. కారే. ఇప్పుడు కూడా ప్రజలు ఇదే ధోరణితో ఉన్నారు.

దీంతో కేసీఆర్ కన్నా.. టీఆర్ ఎస్ కన్నా.. కూడా కారు సింబలే.. ఈటలకు పె ద్దచిక్కుగా మారిందని అం టున్నారు పరిశీలకులు. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. సో.. ఈటల ఎన్నికల గుర్తు.. కమలం. అ యితే.. హుజూరాబాద్ ప్రజలు దీనిని ఇంకా గుర్తించలేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఈటలకు తన ఎన్నికల గుర్తును ప్రజలకు పరిచయం చేసుకోవడం పెద్ద సవాలుగా మారింది. తన ఎన్నికల గుర్తు కారు కాదని.. కమలమని.. ఆయన ఇప్పుడు ప్రజలను తనవైపు తిప్పుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా.. మొత్తానికే మునిగిపోవడం ఖాయం. దీనిని దృష్టిలో పెట్టుకుని.. ఇప్పుడు తనప్రచారంలో ఎన్నికల గుర్తును ఎక్కువగా ప్రజల్లోకితీసుకువెళ్లేందుకు ఈటల ప్రయత్నిస్తున్నారు. మరి ప్రజలు ఏం చేస్తారో చూడాలి.