Begin typing your search above and press return to search.

గ‌మ‌నించారా?: ఏపీ చిహ్నం మారింది!

By:  Tupaki Desk   |   16 Aug 2018 7:14 AM GMT
గ‌మ‌నించారా?: ఏపీ చిహ్నం మారింది!
X
ఏపీ అధికార చిహ్నం మారిపోయింది. గుట్టుచ‌ప్పుడు కాకుండా ఈ మార్పు చోటు చేసుకుంది. ఏళ్ల‌కు ఏళ్లుగా ఏపీ అధికార‌చిహ్నం ఏమిట‌న్న ప్ర‌శ్న‌కు ట‌క్కున‌.. పూర్ణ‌కుంభం అన్న స‌మాధానాన్ని చెప్పేసే ప‌రిస్థితి. ఇక‌పై.. అలా చెప్ప‌టానికి వీల్లేదు. ఎందుకంటే.. ఏపీ అధికార‌చిహ్నంగా పూర్ణ‌ఘ‌టంగా మార్చారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఆంధ్ర‌రాష్ట్రం ఏర్ప‌డిన వేళ‌.. పూర్ణ ఘ‌టాన్నే అధికార చిహ్నంగా వినియోగించార‌ట‌.

ఆ త‌ర్వాత ఎవ‌రు చేశారో కానీ.. అది కాస్తా పూర్ణ కుంభంగా మారిపోయింది. గ‌తంలో జ‌రిగిన త‌ప్పును ఇప్పుడు స‌రిదిద్దుకొని.. మూలాల్లోకి వెళ్లి మొద‌ట్లో వాడిన చిహ్నాన్నే ఇక‌పై వాడ‌నున్నారు. ఇంత‌కీ ఈ పూర్ణ‌కుంభం.. పూర్ణ‌ఘ‌టం ఏమిటి? వ్య‌త్యాసం ఏమిటంటారా?

పూర్ణ‌కుంభం అంటే.. దేవాల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు... ప్ర‌ముఖులు వ‌చ్చిన‌ప్పుడు స్వాగ‌తం ప‌ల‌క‌టానికి వినియోగించేది పూర్ణ‌కుంభం. దీనికి ఆకులు లేకుండా ఉండేదే పూర్ణ ఘ‌టం. అస‌లు పూర్ణ‌ఘ‌టంగా చిహ్నాన్ని మొద‌ట్లో ఎందుకు పెట్టార‌న్న విష‌యంలోకి వెళితే.. ధ‌ర్మ‌చ‌క్రం మ‌ధ్య‌లో ఉన్న పూర్ణ‌ఘ‌టాన్ని విదికుడు అనే చ‌ర్మ‌కారుడు చెక్కిన‌ట్లుగా చ‌రిత్ర చెబుతోంది. దీన్ని అక్ష‌య‌పాత్ర‌గా అభివ‌ర్ణిస్తారు కూడా.

త‌ర్వాతి కాలంలో ఈ పూర్ణ‌ఘ‌టానికి ఉన్న తామ‌రాకుల్ని తీసేయ‌టం.. అధికారికంగా ఎవ‌రిప్ర‌మేయం లేకుండానే పూర్ణ‌కుంభంగా మార్చేశారు. అయితే.. ఈ మార్పును తాజాగా గుర్తించారు. 2500 ఏళ్ల నాటి పూర్ణ‌ఘ‌టాన్ని తీసేసి.. పూర్ణ‌కుంభంగా మార్చ‌టం స‌రికాద‌న్న భావ‌న‌కు వ‌చ్చిన ఏపీ స‌ర్కారు.. తాజాగా మార్పుల్ని చేప‌ట్టింది.

ఇందులో భాగంగానే తాజాగా ఇచ్చిన పంద్రాగ‌స్టు పుర‌స్కారాల సంద‌ర్భంగా పాత చిహ్నాన్ని వీటిపై ముద్రించారు. ఇప్పుడు మ‌ళ్లీ తెచ్చిన ముద్ర‌.. ఆంధ్ర‌రాష్ట్రం తొలుత ఏర్ప‌డిన‌ప్పుడు పెట్టిన అధికార‌చిహ్నం. ఇటీవ‌ల కాలంలో అధికార చిహ్నంపై జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా.. మార్పుల అంశం తెర‌పైకి వ‌చ్చి.. అనంత‌రం దీనిపై లోతుగా ప‌రిశోధ‌న జ‌రిపిన త‌ర్వాత‌.. పాత అధికార చిహ్నాన్ని వినియోగించాల‌ని ఏపీ స‌ర్కారు డిసైడ్ చేసింది. అలా పూర్ణ కుంభం కాస్తా.. పూర్ణ‌ఘ‌టంగా మారింది.