Begin typing your search above and press return to search.

జపాన్ లో షాకింగ్ పరిణామం.. ఇలానే జరిగితే ఆ దేశం మాయమేనా?

By:  Tupaki Desk   |   3 Jun 2023 11:00 AM GMT
జపాన్ లో షాకింగ్ పరిణామం.. ఇలానే జరిగితే ఆ దేశం మాయమేనా?
X
ప్రపంచ మ్యాప్ లో చూస్తే.. చిన్న డాట్ లెక్కన కనిపించే బుజ్జి దేశం జపాన్. అలా అని దాన్ని తక్కువగా అంచనా వేయటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో జపాన్ ఒకటి. అయితే.. ఆ దేశం ఇప్పుడు సరికొత్త సమస్యను ఎదుర్కోంటోంది. అది కూడా మరింత ఎక్కువగా. ఆ దేశంలో జనాభా సంక్షోభం అంతకంతకూ ముదిరిపోతోంది. పుట్టేటోళ్లు తగ్గిపోతుంటే.. మరణించేటోళ్లు ఎక్కువ అయిపోతున్నారు. దేశంలో మహిళల సగటు సంతానోత్పత్తి రేటు వరుస ఏడో సంవత్సరం పడిపోయింది. 2022 గణాంకాల ప్రకారం మహిళల సగటు సంతానోత్పత్తి రేటు 1.26గా గుర్తించారు. అంతకు ముందు ఏడాది అది 1.30గా ఉండేది.

ఒక దేశం జనాభా సమన్వయం (పుట్టుకలు వర్సెస్ మరణాలతో లెక్కేసేటప్పుడు) 2.06-2.07 మధ్యన ఉంటే సమతుల్యతలో ఉన్నట్లు. ప్రస్తుతం జపాన్ దేశ జనాభా 12.5 కోట్లు. గడిచిన పదహారేళ్లుగా ఆ దేశంలో జనాభా అంతకంతకూ తగ్గిపోతున్న దుస్థితి. ఒక అంచనా ప్రకారం 2070 నాటికి.. అంటే మరో యాభై ఏళ్లకు ఆ దేశ జనాభా సంఖ్య 8.7 కోట్లకు తగ్గిపోతుందని చెబుతున్నారు.

అంకెల్లో చెప్పుకుంటే.. ఆ దేశంలో గత ఏడాదిలోచోటు చేసుకున్న మరణాలు 15.7 లక్షలు అయితే.. జన్మించినోళ్లు కేవలం 7.7 లక్షలు కావటం గమనార్హం. అంటే.. ఏడాదిలో ఆ దేశ జనాభా 8 లక్షల వరకు తగ్గిపోయినట్లు. ఇలా జనాభా తగ్గిపోతుంటే.. దేశ ఆర్థిక పరిస్థితి మీద తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ దేశం కిందామీదా పడుతోంది. అందుకే.. దేశ జనాభాను ప్రోత్సహించటం కోసం కొత్తగా చైల్డ్ కేర్ ప్యాకేజీ కోసం వచ్చే మూడేళ్లో భారీఎత్తున నిధులు కేటాయించి.. ఖర్చు చేస్తున్నా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావట్లేదు.

ఇదే తీరులో జనాభా తగ్గిపోతే ఆ దేశ ప్యూచరర్ ఏమిటి? అన్నది మరో ప్రశ్న. సామాన్యుడి సైతం వచ్చే ఇదే ప్రశ్నకు ఆ దేశ ప్రధానికి సలహాదారుగా ఉండే పెద్ద మనిషి ఒక సందర్భంలో మాట్లాడుతూ.. 'ఇదే పరిస్థితి కొనసాగితే దేశం అదృశ్యమవుతుంది’ అంటూ ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం. 2008లో ఆ దేశ జనాభా 12.8 కోట్లు ఉంటే.. ఇప్పుడు ఆ దేశ జనాభా 12.5 కోట్లు. జనాభా అంతకంతకూ తగ్గిపోతున్న నేపథ్యంలో ఆ దేశానికి ఆర్థిక సవాళ్లు మాత్రమే కాదు భద్రతా సవాలు పెరిగిపోతున్న పరిస్థితి. మన దేశానికి జనాభా ఒక సమస్యగా మారితే.. జపాన్ మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితిలో ఉందని చెప్పాలి.