పవన్ చేతికి ఓ మీడియా...నేరుగా కాదు

Wed Jul 11 2018 19:16:20 GMT+0530 (IST)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు - జనసేన అభిమానులకు తీపికబురు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి వస్తున్న హాట్ హాట్ వార్తల జాబితాలో మరో వార్త చేరింది. సమాచారం పాతదే అయినప్పటికీ...కొత్త అప్ డేట్ తో వార్త చెలామణిలోకి వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త అంటే...పవన్ ఖాతాలో ఓ టీవీ చానల్ చేరింది. 99 టీవీ పేరుతో సీపీఐ నేతల చేతుల్లో ఉన్న ఓ టీవీ ఛానల్ ను పవన్ పార్టీకి చెందిన కీలక నేత కొనుగోలు చేశారు. ఆయనే మాజీ ఐఏఎస్ - జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్.



ఓ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతిస్తున్న మీడియాను ఢీకొన్న పవన్ తన సొంత మీడియా కోసం కసరత్తు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అప్పటికే దివాలా తీసిన 99 టీవీ చానల్ ను కొనుగోలు చేసేందుకు పవన్ సిద్ధమయినట్లు ప్రచారం జరిగింది. డీల్ కుదిరిందని..చెల్లింపులే ఆలస్యమని వార్తలు చెలామణిలోకి వచ్చాయి. అయితే ఈ కొనుగోలు జరగలేదు. జనసేనలో ఆర్థిక వ్యవహారాలు చూసే ఓ వ్యక్తి చివరి దశలో జోక్యం చేసుకోవడం వల్ల ఆ డీల్ ఆగిపోయిందని - ఈ నిర్ణయం ఇటు జనసేన వర్గాలను - అటు 99 టీవీ సిబ్బందిని సైతం నిరాశ పరిచిందని వార్తలు వచ్చాయి. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీ అయిన సీపీఎం నేతల చేతిలో మెజార్టీ వాట ఉన్న  10 టీవీ ఛానల్ బేరం పెట్టగా పవన్ కొనేందుకు ఉత్సాహం చూపారని వార్తలు వచ్చాయి.

అయితే ఈ డీల్ కూడా బెడిసి కొట్టింది. ఓ ముప్పై కోట్లకు బేరం పెట్టారని - ఇప్పటికే వాటాల రూపంలో నిధులు సమకూర్చిన వారు తమకు రావాల్సిన సొమ్ముల గురించి సంస్థను అడుగుతుండటం - షేర్ల బదిలీ విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పవన్ వెనక్కు తగ్గినట్లు టాక్. ఇలా 10 టీవీ గురించి చర్చోపచర్చలు సాగుతుండగానే పవన్ పార్టీకి చెందిన తోట చంద్రశేఖర్ 99 టీవీని కొనుగోలు చేశారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం టీవీ చానల్ లో పూజ కూడా జరిగింది. వెంటనే సంబంధిత చానల్ పవన్ కు మద్దతుగా ప్రచారం కూడా మొదలుపెట్టింది. కాగా ఐఏఎస్ అధికారి అయిన చంద్రశేఖర్ 2008లో వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకొని పీఆర్పీలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన 2009లో పీఆర్పీ టికెట్ తో గుంటూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయన వైసీపీలో చేరి రాజకీయ భవిష్యత్ వెతుకున్నప్పటికీ అది కలిసి రాలేదు. దీంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి ఇటీవలే పీఆర్పీలో చేరారు. ఇప్పటికే ఆయనకు ఓ యూట్యూబ్ చానల్ కూడా ఉంది.