Begin typing your search above and press return to search.

పాక్ విమాన ప్రమాదం: బయటపడ్డ ఇద్దరు..పైలట్ చివరి మాటలు ఇవే!

By:  Tupaki Desk   |   23 May 2020 7:30 AM GMT
పాక్ విమాన ప్రమాదం: బయటపడ్డ ఇద్దరు..పైలట్ చివరి మాటలు ఇవే!
X
పవిత్రమైన రంజాన్ మాసం చివరి శుక్రవారం రోజు పాకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సిబ్బందితో సహా 91 మంది ప్రయాణికులు మృతి చెందారు. లాహోర్ నుంచి కరాచీకి బయలుదేరిన విమానం సాంకేతిక సమస్యతో కూలిపోయింది. విమానంలో సాంకేతిక సమస్య వచ్చిందని పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ ‌కు తెలియజేశాడు. ఇంజిన్ పాడైనా కూడా ఎలాగో అలాగా విమానాన్ని ల్యాండ్ చేయడానికి పైలట్ రెండు మూడు సార్లు ప్రయత్నించాడు.కానీ, అది సాధ్యపడలేదు. దాంతో పైలెట్ మళ్లీ విమానాన్ని పైకి తీసుకెళ్లాడు. మళ్లీ ఏటీసీ సిబ్బందిని పైలట్ అప్రమత్తం చేశాడు

అయితే, ఇప్పుడు ప్రమాదంజరగడానికి ముందు పైలట్ ఇచ్చిన సంకేతాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ప్రమాదం లో ఉన్నామని ఫైలెట్ ఏటీసీ సిబ్బందిని పైలట్ అప్రమత్తం చేశాడు. దాంతో ఏటీసీ సిబ్బంది ఫ్లైట్ ల్యాండ్ కావడానికి రెండు రన్ వేలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రన్ వే మీద విమానాన్ని ల్యాండింగ్ చేయాలని ఏటీసీ సిబ్బంది పైలట్‌ని కోరారు. కానీ, అప్పటికే విమానం పూర్తిగా కంట్రోల్ తప్పింది. దాంతో పైలట్ ఏటీసీకి ప్రాణాపాయ స్థితిలో చెప్పే కోడ్ వర్డ్…. మే డే.. మే డే.. మే డే.. అని మూడు సార్లు చెప్పాడు. ఆ తర్వాత ఏటీసీతో విమానానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ సంభాషణ అంతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్టేషన్‌లో రికార్డ్ అయ్యింది. అయితే, ప్రాణాపాయ స్థితిలో చెప్పే కోడ్ వర్డ్…. మే డే.. మే డే.. మే డే అని చెప్పగానే ఏటీసీ అధికారులు రంగంలోకి దిగాలి… కాని అలా జరగలేదు. తర్వాత కొన్ని క్షణాలకే విమానం ఓ మొబైల్ టవర్‌ను ఢీకొట్టి జనావాసాల్లో కుప్పకూలింది. సజ్జాద్ అనే పైలట్ కు సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ ఈ విమానం ఇంతటి ఘోర ప్రమాదానికి గురి కావడం పాక్ వైమానిక దళ అధికారులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈ ఘోర విమాన ప్రమాదంలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. జాఫర్ మసూద్ అనే బ్యాంకు ఉద్యోగి, మహమ్మద్ జుబేర్ అనే ఓ ఇంజనీరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వారు ఈ ప్రమాదాన్ని గురించి వారు వివరిస్తూ.. పైలట్ సజ్జాద్ గల్ మొదట ప్లేన్ ని కిందకు దింపాడని, అయితే జనావాసాల మధ్య విమానం ఉన్నందున మళ్ళీ దాన్ని పైకి ఎగిరేలా చూశాడని చెప్పారు. 10 నిముషాలసేపు గాల్లో విమానం ఎగిరిన తర్వాత.. తను తిరిగి ప్లేన్ ని కిందకు దింపుతున్నట్టు చెప్పాడని తెలిపారు. అలా చెబుతుండగానే విమానం భూమిని బలంగా ఢీ కొన్నదని, ఆ కుదుపునకు తాము ఎక్కడో పడిపోయామన్నారు. కళ్ళు తెరచి చూడగానే దట్టమైన పొగలు, రేగుతున్న మంటల మధ్య విమానం మండి పోవడాన్ని చూశామని తెలిపారు.