Begin typing your search above and press return to search.

మాకు ఇంగ్లీష్ మీడియమే కావాలి .. 96.17% మద్దతు !

By:  Tupaki Desk   |   1 May 2020 11:00 AM IST
మాకు ఇంగ్లీష్ మీడియమే కావాలి .. 96.17% మద్దతు !
X
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 96.17 శాతం మంది తల్లిదండ్రులు ఆమోదం తెలిపారు. ఈమేరకు తమ ఐఛ్చికాన్ని లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. అసలు విషయమేంటంటే ..ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ..పేద , బడుగు , బలహీన వర్గాల పిల్లలకి సైతం కార్పొరేట్ స్థాయి విద్యని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ బోధించాలనే నిర్ణయాన్ని తీసుకుంది. అయితే , వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంత వివాదంగా మారిందో అందరికి తెలిసిందే.

అనేక విమర్శలు ..ఆరోపణలతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. చివరికి పేద ప్రజల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదు అని కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఏ మీడియంలో చ‌ద‌వాలో పిల్ల‌లు, వాళ్ల త‌ల్లిదండ్రుల ఇష్టానికి విడిచిపెట్టాల‌ని, నిర్బంధం మంచిది కాద‌ని హైకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో 2020-21 విద్యా సంవ‌త్స‌రం నుంచి ఏ మాధ్య‌మంలో చ‌ద‌వాల‌నుకుంటున్నారో తెలుసుకునేందుకు ప్ర‌భుత్వం రాత‌మూల‌కంగా అభిప్రాయ సేక‌ర‌ణ చేప‌ట్టింది. విద్యార్థుల త‌ల్లిదండ్రుల ముందు ప్ర‌భుత్వం మూడు ఆప్ష‌న్లు పెట్టింది. అవి తెలుగు తప్పని సరిగా ఉంటూ ఆంగ్ల మాధ్యమంలో బోధన, తెలుగు మాధ్యమంలో బోధన . ఇతర భాషల్లో బోధన అనే మూడో ఆప్షన్లు ఇచ్చారు.

1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు 17,87,035 మంది ఉన్నారు. వీళ్ల‌లో 17,85,669 మంది తల్లిదండ్రులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇంగ్లీష్ మీడియం ఆప్ష‌న్ ను 96.17 శాతం మంది ప్ర‌భుత్వానికి త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియంలో బోధనకే ఓటు వేశారు. తెలుగు మీడియం కోరుకున్నవారు 3.05 శాతం మంది. ఇతర భాషా మీడియం కోరుకున్న వారు 0.78 శాతం ఉన్నారు. మొత్తంగా ఆంగ్ల మాధ్యమంలో బోధన ద్వారానే తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనితో ప్రజలు ..ప్రభుత్వ నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తున్నారు అని చెప్పవచ్చు.