ఓ ఇరవైయ్యేళ్లు అమ్మానాన్న తోడుగా.. పుట్టిల్లే లోకంగా బతుకుతుంది భారతీయ సగటు యువతి.. ఆడబిడ్డగా.. ఇంట్లో మహాలక్ష్మిగా ఎంతో గౌరవ మర్యాదలు పొందుతుంది. అందుకే.. పెళ్లయి అత్తవారింటికి వెళ్లే ముందు భావోద్వేగంతో కన్నీరుమున్నీరవుతుంది. అటు తల్లిదండ్రులు కూడా అంతే. ఆడ పిల్ల వెళ్లిపోతున్నదంటే గుండెలు పిండేసినంత బాధతో కన్నీరు పెట్టుకుంటారు. ఆడ వెళ్ళిపోయిన ఇల్లు.. లక్ష్మి లేని ఇల్లుగా భావిస్తారు. భారత సమాజంలో ఏ మతం వారైనా.. ఏ కులంవారి ఇంట్లో నైనా ఇలాంటి సీన్లు సహజం.
పుట్టిల్ల్లే కాదు.. మెట్టిల్లూ వదిలి పెళ్లయ్యాక పుట్టింటిని విడిచివెళ్లే ఆడ పిల్ల మెట్టినింటినే సర్వస్వంగా భావిస్తుంది. భర్త పిల్లలు అత్తమామల సేవే లోకంగా జీవిస్తుంది. పుట్టింటిపై లోలోపల ప్రేమ ఉన్నా.. కొన్నాళ్లకు మెట్టినిల్లే ఆమెకు అంతా అవుతుంది. అయితే మన దేశంలో ఇప్పుడు మహిళలు పుట్టిల్లే కాదు మెట్టినిల్లూ విడిచి వెళ్తున్నారు. పెళ్లి పీటలపై భర్తతో ఏడడుగులు వేసే ఆమె.. జీవనోపాధి కోసం బయటకు వెళ్లేందుకు ఎన్ని అడుగులైనా వేస్తోంది.
విదేశాలకూ వెళ్లిపోతూ ముప్పయి ఏళ్లుగా భారతీయుల జీవన ప్రమాణాలు మారుతున్నాయి. ఓ మాటలో చెప్పాలంటే మెరుగుపడుతున్నాయి. టెక్నాలజీ కోర్సులు చదవడం.. సాఫ్ట్ వేర్ బూమ్.. విదేశాల్లో ఉద్యోగాలు.. దీనికి కారణాలు. ఈ క్రమంలో భారతీయ యువతులు భర్తతో పాటే దేశం దాటుతున్నారు. ఈ విషయమే చెబుతోంది నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్). దేశంలో మహిళల వలసలకు ప్రధానంగా పెళ్లిళ్లే కారణమవుతున్నాయని స్పష్టం చేసింది. ఉపాధి వెదుక్కుంటూ భర్తలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండడంతో వారితో పాటే భార్యలు వెళ్లక తప్పడం లేదని అంటోంది.
93.4 శాతం వలసలకు వివాహాలే కారణం వ్యక్తి వలసల్లో తెలంగాణ ఏపీ ఐదు ఆరు స్థానాల్లో ఉన్నట్లు నేషనల్ శాంపిల్ సర్వే పేర్కొంది. ఇక దేశంలోని 87 శాతం మహిళలు వివాహాల కారణంగా వలస వెళ్లాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 93.4 శాతం గ్రామీణ ప్రాంతాల్లో 71.5 శాతం మంది మహిళలు పెళ్లి కారణంగా వలస వెళ్లారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన 78వ రౌండ్ 'నేషనల్ శాంపిల్ సర్వే'లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
మహిళల వలసలకు ప్రధాన కారణాలేమిటి అన్న కోణంలో ఈ సర్వే జరిగింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు విద్య పెళ్లిళ్లు సామాజిక రాజకీయ సమస్యలు తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల పోషణ.. వీటిలో దేని మూలంగా మహిళలు ఎక్కువగా వలస వెళ్లాల్సి వస్తుందని ఈ సర్వే చేయగా పెళ్లిళ్లే అందుకు కారణమని తేలింది. ఒక వ్యక్తి 6 నెలలకు మించి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే దానిని వలస కింద పరిగణిస్తూ ఈ సర్వే చేశారు. దేశంలో ఒక వ్యక్తి(పర్సన్) వలసల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లు ఐదు ఆరు స్థానాల్లో ఉండగా మొదటి స్థానంలో హిమాచల్ప్రదేశ్ రెండో స్థానంలో పంజాబ్ మూడో స్థానంలో కేరళ నాలుగో స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.