Begin typing your search above and press return to search.

మాటలకందని దారుణం.. ఆత్మాహుతి దాడిలో 93 మంది మృత్యువాత!

By:  Tupaki Desk   |   31 Jan 2023 2:38 PM GMT
మాటలకందని దారుణం.. ఆత్మాహుతి దాడిలో 93 మంది మృత్యువాత!
X
పాకిస్థాన్‌ లోని పెషావర్‌ నగరంలో పోలీసు లైన్సులో ఉన్న ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ 93 మంది మృత్యువాత పడ్డారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిపారని పోలీసులు వెల్లడించారు. శిథిలాల నుంచి ఇంకా మృతదేహాలను వెలికి తీస్తున్నట్లు తెలిపారు.

పెషావర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పోలీస్‌ లైన్సులోని మసీదులో జనవరి 30 మధ్యాహ్నం ఆత్మాహుతి దాడి జరిగింది. నిన్నటి నుంచి శిథిలాలను తొలగిస్తున్నా ఎవరూ సజీవంగా లభించలేదని ఒక అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

పెషావర్‌ ఆస్పత్రి అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడి జరపడంతో దాదాపు 20 మంది పోలీసు అధికారులు, భద్రతా సిబ్బంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు ఈ ఆత్మాహుతి దాడి ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఏ ఉగ్ర ముఠా ఇంకా ప్రకటన జారీ చేయలేదు. జనవరి 30న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అధ్యక్షుడు పాకిస్థాన్‌లో పర్యటించాల్సి ఉంది. ఆ సమయంలోనే ఈ ఆత్మాహుతి దాడి జరగడం గమనార్హం. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన పాక్‌ లో జనవరి 31న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు చెందిన ప్రతినిధులు పర్యటించనున్న వేళ ఈ దారుణం జరిగింది.

పేలుడు దాటికి మసీదు పైకప్పు, ఓ వైపు గోడ భాగం కూలిపోయింది. ఆత్మాహుతి దాడి చోటు చేసుకున్నప్పుడు మసీదులో ప్రార్థనలు చేస్తూ పెద్ద ఎత్తున జనం ఉన్నారని సమాచారం. భవన శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మసీదులో ఓ వ్యక్తి తనతంట తాను పేల్చుకున్నట్లు.. తొలి వరుసలో ఉన్న వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.