Begin typing your search above and press return to search.

ఒక్కరోజే 90 శాతం పెరుగుదల. భారత్ లో 2183 కోవిడ్ కేసులు

By:  Tupaki Desk   |   18 April 2022 5:40 AM GMT
ఒక్కరోజే 90 శాతం పెరుగుదల. భారత్ లో 2183 కోవిడ్ కేసులు
X
ఇప్పటికే చైనాను వణికిస్తూ అక్కడ లాక్ డౌన్ కు కారణమైన కరోనా ఇప్పుడు భారత్ లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇన్ని రోజులు 1000కి దగ్గర్లో నమోదైన కొత్త కేసులు.. ఆదివారం రెండువేల మార్క్ దాటేశాయి. మరోవైపు మరణాలు కూడా 200కు పైగా నమోదయ్యాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అక్కడి పరిసర ప్రాంతాల్లో 15 రోజుల్లోనే కోవిడ్ వ్యాప్తి 500 శాతం పెరిగినట్లు ఓ సర్వేలో తేలింది. సోమవారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో మళ్లీ కరోనా తీవ్రత మొదలైనట్టు కనిపిస్తోంది.

ఆదివారం 2.6 లక్షల మందికి కరోనా టెస్టులు చేయగా 2183 కేసులు నమోదైనట్టు తేలింది. ముందురోజు 1150గా ఉన్న కేసుల సంఖ్య తాజాగా 90శాతం మేర పెరగడం గమనార్హం. కేరళ లో అత్యధికంగా 940 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీలో 517 పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకూ దేశంలో 4.30 కోట్ల మందికి వైరస్ సోకింది.

ఇక గడిచిన 24 గంటల్లోనే 214 మరణాలు సంభవించాయి. అందులో కేరళ నుంచి వచ్చినవే 213 కేసులు కావడం గమనార్హం. ఇకొకటి యూపీలో నమోదైంది.

నిన్న 1985 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. క్రియాశీల కేసులు 11542కు చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో రికవరీల వాటా 98.76 శాతంగా ఉండగా.. క్రియాశీల కేసులు 0.03 శాతంగా ఉన్నాయి.

సెలవు రోజు కావడంతో నిన్న 2.66 లక్షల మంది మాత్రమే టీకాలు వేసుకున్నారు. 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ టీకా కార్యక్రమంలో ఇప్పటిదాకా 186 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.