Begin typing your search above and press return to search.

9 గంటల కేసీఆర్ కేబినెట్ భేటీలో 3 గంటలు దాని గురించే చర్చనట

By:  Tupaki Desk   |   19 Jan 2022 7:42 AM GMT
9 గంటల కేసీఆర్ కేబినెట్ భేటీలో 3 గంటలు దాని గురించే చర్చనట
X
ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం మొదలైన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ.. అర్థరాత్రికి కాస్త ముందుగా ముగియటం.. దగ్గర దగ్గర 9 గంటలకు పైనే సాగటం తెలిసిందే. ఇన్నేసి గంటలు మంత్రివర్గ సమావేశంలో ఏం చర్చించారు? అన్న దానిపై స్పష్టత రాలేదు. కాకుంటే.. కోవిడ్ పరిస్థితులు.. తెలంగాణ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియా ఏర్పాటు చేయటం.. మన ఊరు.. మన బడి పేరుతో ఒక కార్యక్రమానికి సంబంధించిన అంశాలతో పాటు.. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై మాట్లాడినట్లుగా వచ్చింది. కానీ.. అత్యధిక భాగం ఒక అంశం మీద కేబినెట్ లో చర్చ జరగటం.. దానికి సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాకపోవటం ఆసక్తికరంగా మారింది.

దీనికి సంబంధించిన వివరాల్ని ఒక ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. మొత్తం 9 గంటల పాటు సాగిన తెలంగాణ కేబినెట్ భేటీలో ఏకంగా మూడు గంటల పాటు హైదరాబాద్ మెట్రో మీదనే చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. భారీ నష్టాల్ని మూటకట్టుకుంటున్న ఎల్ అండ్ టీ.. ప్రాజెక్టును వదిలేసి వెళ్లిపోతానని చెబుతోందని.. ఏం చేద్దామన్న అంశంపై కేసీఆర్ అధ్యక్షతన సాగిన మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా చర్చించినట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ మహానగరానికి కొత్త శోభను ఇచ్చేలా.. ప్రజా రవాణాలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికిన మెట్రోరైలు కారణంగా ఇప్పటివరకు రూ.3300 కోట్ల వరకు నష్టాలు (మరింత సరిగ్గా చెప్పాలంటే రూ.3280 కోట్లు) వచ్చాయి.

ఇప్పుడున్న కొవిడ్ పరిస్థితుల్లో తామీ ప్రాజెక్టును భరించలేకపోతున్నట్లుగా ఎల్ అండ్ టీ పేర్కొంటోందని.. విడిచి పెట్టేస్తానని చెబుతున్నట్లుగా మంత్రులతో సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. భారీగాపెరుగుతున్న నష్టాలతో మెట్రో నిర్వహణ కష్టసాధ్యంగా మారినట్లుగా పేర్కొన్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఏం చేయాలన్న దానిపై చర్చ సాగినట్లుగా చెబుతన్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకోకుంటే.. బాధ్యతల నుంచి తప్పుకుంటామని చెప్పినట్లుగా పేర్కొన్నారు.

రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో మరికొంతకాలం హైదరాబాద్ మెట్రోకు నష్టాలు తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎల్ అండ్ టీకి ప్రోత్సహాకాల్ని ప్రకటించటం ద్వారా ఉపశమనం కలిగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా చెబుతున్నారు. కొవిడ్ కు ముందు 3.80 లక్షల నుంచి 4.10 లక్షల వరకు రాకపోకలు సాగిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత మెట్రోను తెరిచినప్పటికీ రోజుకు 60-70 వేల మధ్యనే ప్రయాణాలు సాగాయి. రెండో వేవ్ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. గత ఏడాది డిసెంబరులో రోజుకు 2.6 లక్షల మంది ప్రయాణిస్తున్నా.. అదేమీ కూడా కొవిడ్ కుముందు పరిస్థితి మాత్రం లేదనే చెప్పాలి.

ఐటీ కారిడార్ పూర్తిస్థాయిలో పని చేయకపోవటం.. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయటం కారణంగా..ఆ రూట్ లో ప్రయాణాలు బాగా తగ్గిన పరిస్థితి. హైదరాబాద్ మెట్రోకు ఆదాయంగా టికెట్లను పెద్దగా లెక్కలోకి వేసుకోనప్పటికీ.. దానికి అనుబంధంగా ఉన్న మాల్స్ నుంచి.. ప్రకటనల నుంచి.. అద్దెల రూపంలోనూ ఆదాయం వస్తుందని భావించారు. కానీ.. కొవిడ్ ఈ అంచనాల్ని దెబ్బేసింది. కేంద్రం నుంచి సాయం అందే పరిస్థితి లేకపోవటంతో.. రాష్ట్ర సర్కారే సొంతంగా సాయం చేయాలన్న యోచనలో సీఎం ఉన్నట్లు చెబుతున్నారు.

ఇప్పడున్న పరిస్థితుల్లో ఎల్ అండ్ టీకి రూ.800 - రూ.వెయ్యి కోట్ల సాయాన్ని అందించేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని.. దానికి సంబంధించిన అంశాల మీద కసరత్తు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒక్కసారి కొవిడ్ పరిస్థితులు పోయి.. మామూలు పరిస్థితులు నెలకొన్న తర్వాత బాగా పుంజుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా హైదరాబాద్ మెట్రో విషయం మీద అన్నేసి గంటల పాటు చర్చించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో చూడాలి.