Begin typing your search above and press return to search.

ఆ బైక్ మీద 87 చలానాలు.. ఎలా దొరికాడంటే?

By:  Tupaki Desk   |   6 March 2021 4:30 AM GMT
ఆ బైక్ మీద 87 చలానాలు.. ఎలా దొరికాడంటే?
X
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. తమకు నచ్చినట్లు చేస్తున్నారే తప్పించి.. రూల్స్ ను పాటించని తీరు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ మహానగర రోడ్ల మీద టూవీలర్ మీద ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారు నిత్యం కనిపిస్తూనే ఉంటారు. ఇలాంటి వారిని అక్కడి ట్రాఫిక్ పోలీసులు తమ దగ్గర ఉన్న కెమేరాతో ఫోటోలు తీస్తూ ఉంటారు. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించిన వారికి నోటీసులు పంపుతూ షాకులు ఇస్తుంటారు.

ఇలా వచ్చే నోటీసుల్ని లైట్ తీసుకోవటం.. తమ పని తాము చేసుకోవటం చాలామందిని చూస్తుంటాం. తాజాగా.. అలాంటి తీరును ప్రదర్శించే ఉల్లంఘనుడ్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. అదెలానంటే.. సైఫాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు వీలుగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఏపీ09 బీటీ5089 నెంబరు ఉన్న బైక్ మీద వెళుతున్న వ్యక్తిని ఆపారు.

అతడి బండిపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 87 చలానాలు ఉన్న విషయాన్ని గుర్తించారు. ఆ వెంటనే.. బండిని పక్కన పెట్టి.. సదరు వాహదారుడ్ని పక్కన నిలచోబెట్టారు. వాహన యజమాని ఎంఎస్ మక్తాకు చెందిన సాజిద్ అని గుర్తించారు. తరచూ నిబంధనల్ని ఉల్లంఘించే ఇతగాడి పెండింగ్ చలానాల్ని క్లియర్ చేయాలంటే రూ.20,400చెల్లించాలని స్పష్టం చేశారు. అంత డబ్బు తన దగ్గర లేదని చెప్పటంతో.. బండిని సీజ్ చేసి.. పెండింగ్ చలానాల్ని చెల్లించిన తర్వాతే బండి ఇస్తానని చెప్పారు. సో.. మీ బండిని కూడా ఆన్ లైన్ లో చెక్ చేసుకోండి. పెండింగ్ చలానాలు ఉంటే చెల్లించేయండి. లేకుంటే.. లేనిపోని ఇబ్బందులు ఎదురుకావటం ఖాయం.