Begin typing your search above and press return to search.

చైనా నుంచి వచ్చిన 83 మందిని ఒడిశాలో బయటకు రానివ్వట్లేదు

By:  Tupaki Desk   |   15 Feb 2020 11:30 AM GMT
చైనా నుంచి వచ్చిన 83 మందిని ఒడిశాలో బయటకు రానివ్వట్లేదు
X
క్యాలెండర్లో రోజులు గడుస్తున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ 19 (కరోనా) వైరస్ కు సొల్యూషన్ మాత్రం ఇప్పటికి రాలేదు. కనుచూపు మేరలో వస్తుందనే పరిస్థితి కనిపించట్లేదు. రోజు గడుస్తున్న కొద్దీ కొవిడ్ బారిన పడిన పలువురు చనిపోతున్నారు. చైనాలో శుక్రవారం వరకూ కొవిడ్ కారణంగా మరణించిన వారిసంఖ్య ఏకంగా 1600 మందికి చేరింది. కొత్తగా మరో రెండు వేలకు పైగా ప్రజలకు సోకినట్లుగా చెబుతున్నారు.

ఇప్పటివరకూ ఈ మాయదారి వైరస్ బారిన పడి మరణించిన వారిలో ఎక్కువమంది హుబెయ్ ఫ్రావిన్సుకు చెందిన వారే. వైరస్ ను కట్టడి చేయటానికి వీలుగా అత్యాధునిక బిగ్ డేటా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ .. క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించాలని చైనా అధ్యక్షుడు తాజాగా పిలుపునిచ్చారు.

వూహాన్ ఆసుపత్రుల్లో కొవిడ్ వైరస్ బాధితులకు వైద్య సాయం అందించేందుకు రోబోల్ని వినియోగిస్తున్న వేళ.. ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. జనవరి 15 వరకు చైనా నుంచి వచ్చిన 83 మంది ఒడిశా ప్రజల్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచేసింది. వారిని బయటకు రానివ్వటం లేదు. వీరంతా చైనా నుంచి తిరిగి రావటంతో.. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో బయటకు రానివ్వటం లేదంటున్నారు. అయితే.. కొవిడ్ వైరస్ ప్రభావం పద్నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది. మరి.. అలాంటప్పుడు ఒడిశాలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచిన వారిని ఇంకా ఎందుకు బయటకు రానివ్వటం లేదన్న ప్రశ్నను కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే వారిని బయటకురానివ్వటం లేదంటున్నారు.

ఇదిలా ఉంటే.. కొవిడ్ వైరస్ నేపథ్యంలో చైనా.. హాంకాంగ్.. సింగపూర్ లాంటి దేశాల్లో ప్రేమికుల దినోత్సవం వేళ కనిపించే హడావుడి కనిపించలేదు. వీధులన్ని నిర్మానుష్యంగా మారాయి.మాస్కులు ధరించి ప్రేమికులు అక్కడక్కడా వీధుల్లో కనిపించటం గమనార్హం. మామూలుగా అయితే.. ప్రేమికుల దినోత్సవాన్ని భారీ ఎత్తున జరుపుకునే వారు. కోవిడ్ పుణ్యమా అని ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.