Begin typing your search above and press return to search.

వామ్మో హైదరాబాద్ కు ఏమైంది? ఇలా అయితే ఎలా?

By:  Tupaki Desk   |   12 May 2020 4:15 AM GMT
వామ్మో హైదరాబాద్ కు ఏమైంది? ఇలా అయితే ఎలా?
X
తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ముప్పు ముంగిట్లో ఉందా? అన్న భయాందోళనలు రేకెత్తే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం ప్రభుత్వం ప్రకటించిన కొత్త కేసుల విషయంలో మొత్తం పాజిటివ్ లన్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 79 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా రాష్ట్ర సర్కారు ప్రకటించగా.. అవన్నీ హైదరాబాద్ నగరానివే కావటం గమనార్హం.

ఇంత పెద్ద ఎత్తున కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో కేసుల తీవ్రత తగ్గిపోవటమే కాదు.. పలు జిల్లాల్లో కేసులు నమోదై రెండు.. మూడు వారాలు దాటిపోయిన పరిస్థితి. ఇందుకు భిన్నమైన పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జియాగూడ ప్రాంతంలో సోమవారం ఒక్కరోజులోనే 25 పాజిటివ్ కేసులు నమోదు కావటం సంచలనంగా మారింది. ఆదివారం వరకు ఆ ప్రాంతంలో 43 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. తాజాగా నమోదైన కేసులతో అది కాస్తా 68గా మారింది.

ఎందుకిలా జరగుతోంది? ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. పెద్ద ఎత్తున కేసులు నమోదు కావటాన్ని ఎందుకు నిరోధించలేకపోతున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. వేర్వేరు ప్రాంతాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా నగరానికి వస్తున్న కారణంగా కేసులు నమోదు అవుతున్నట్లుగా ఒక వాదన వినిపిస్తోంది.
అదే సమయంలో.. నగర ప్రజల్లో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద పట్టింపులు లేకుండా వ్యవహరించటం కూడా కేసులు పెరగటానికి కారణంగా భావిస్తున్నారు. హైదరాబాద్ మహానగరం విస్తీర్ణంలో పెద్దది కావటం.. కొత్త కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికారుల నిఘా అంత ఎక్కువగా లేకపోవటం కూడా కేసులు పెరిగిపోవటానికి కారణమన్న వాదనను వినిపిస్తున్నారు.

ఏమైనా.. తాజాగా నమోదైన కేసులు మాత్రం హైదరాబాదీయుల్లో వణుకు పుట్టేలా చేస్తున్నాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇదే తీరులో కొత్త కేసులు నమోదైన పక్షంలో.. సిటీలో సాధారణ పరిస్థితులు నెలకొనటం ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.