Begin typing your search above and press return to search.

పంద్రాగ‌స్టు వేళ : దేశాన్ని అమ్మ‌కండి బాస్ !

By:  Tupaki Desk   |   14 Aug 2022 4:35 AM GMT
పంద్రాగ‌స్టు వేళ : దేశాన్ని అమ్మ‌కండి బాస్ !
X
ఆగ‌స్టు 15 .. ఈ రోజు ప్ర‌త్యేకం. ఈ సారి ప్ర‌త్యేకం. ఏటా క‌న్నా మ‌రింత ప్ర‌త్యేకం. కాస్తో కూస్తో ప‌రిణితి సాధించి ఉన్న దేశానికి 75 ఏళ్ల స్వ‌తంత్రం మంచినే పంచింది. ఈ క్ర‌మంలో దేశం సాధించిన పురోగ‌తి, విద్య,వైద్య, ర‌క్ష‌ణ, ఆర్థిక రంగాల్లో, శాస్త్ర, సాంకేతి రంగాల్లో, సంగీత, సాహిత్య రంగాల్లో సాధించిన వృద్ధి గురించి మాట్లాడుకోవాలి. వీలున్నంత వ‌ర‌కూ ప్ర‌గ‌తిశీల‌కం అయిన విష‌యాలే చ‌ర్చించుకుని తీరాలి. కానీ మ‌న గొప్ప‌లు మ‌నం చెప్పుకోవ‌డంలో కొన్ని సార్లు అర్థం లేదు.

ఎందుకంటే సాధించాల్సిన‌వి ఇంకా ఏవో మిగిలే ఉన్నాయి. మ‌న వీధులు మ‌న బడులు అన్నీ అన్నీ ఇంకా ఇంకా పురోగ‌తి లేదా ప్ర‌గ‌తి అందుకోవాలి అని చెప్పే త‌రుణం ఇప్ప‌టిది. ముందున్న కాలాన దేశానికి కావాల్సినంత శ‌క్తి సామర్థ్యాలున్న యువ‌త అవ‌స‌రం క‌నుక ఆ మేర‌కు మాన‌వ వ‌న‌రుల వృద్ధి, వికాసం, జీవ‌న ప్ర‌మాణాల పెరుగుద‌ల అన్న‌వి కీలకం అయి ఉన్నాయి. కానీ ఈ దేశాన్ని న‌డుపుతున్న బీజేపీ పెద్ద‌ల‌కు ఇవ‌న్నీ ప‌ట్టింపులో ఉంటున్నాయా అన్నది ఓ ప్ర‌శ్న.

ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌న్నింటినీ వ‌రుస‌గా ప్ర‌యివేటు ప‌రం చేస్తూ వెళ్తున్న కేంద్రానికి ఇటువంటి వేళ త‌మ త‌ప్పిదాలు గుర్తు చేసే వారెవ్వ‌రు. ఇప్ప‌టికే బీఎస్ఎన్ఎల్, రైల్వే ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు వేసిన అడుగులు కొంత మేర స‌ఫ‌లీకృతం అయ్యాయి. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లేవీ లేకుండా చేసేందుకు అతి పెద్ద ప్ర‌జాస్వామ్యంలో కార్పొరేట్ శ‌క్తుల నాట‌కం ఒక‌టి న‌డుస్తోంది. వాటికే పాల‌కులు వంత పాడుతున్న దాఖ‌లాలూ ఉన్నాయి. క‌నుక విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ అమ్మేసినా లేదా అమ్మే ప్ర‌య‌త్నాలు చేసినా రేప‌టి వేళ సింగ‌రేణి బొగ్గు గ‌నుల‌ను (తెలంగాణ కేంద్రంగా ఉన్న‌) కార్పొరేట్ శ‌క్తుల ప‌రం చేసినా ప్ర‌శ్నించే వారు లేక‌పోతే ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌న్నీ నిర్వీర్యం అవుతాయి. బాధ్య‌త గ‌ల పౌరులు సంబంధిత చర్య‌ల‌ను అడ్డుకోవాలి. కానీ ఆ ప‌ని మాత్రం చేయ‌రు.

ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌న్నీ ప్ర‌యివేటు ప‌రం అయ్యాక , అవి కూడా న‌ష్టాల బాట‌లోనే ఉంటున్నాయి. ఆయా సంద‌ర్భాల్లో కంపెనీలు కొన్ని బ్యాంకులను ఆశ్ర‌యించి లోన్లు పొంది ఉద్దేశ‌పూర్వ‌క ఎగ‌వేత‌దారులుగా మారుతున్నాయి. ఇవ‌న్నీ కూడా బాధ్య‌త లేని పౌరులు, స‌రైన తిరుగుబాటు లేని ప్ర‌జ‌ల కార‌ణంగానే సాగుతున్నాయి. అందుకే చాలా చోట్ల ప్ర‌భుత్వ ఆస్తుల‌న్నీ ఇప్ప‌టికే ప్ర‌యివేటు ప‌రం అయిపోయాయి.