Begin typing your search above and press return to search.

75ఏళ్ల వయసులో అనుమానం..పెనుభూతమైంది!

By:  Tupaki Desk   |   10 Sept 2019 1:07 PM IST
75ఏళ్ల వయసులో అనుమానం..పెనుభూతమైంది!
X
50 ఏళ్లకు పైగా సంసారం వాళ్లది.. నలుగురు కుమార్తెలు - ఒక కొడుకు పెళ్లిళ్లు అయిపోయాయి. ఏడు పదుల వయసు.. ఆ వయసులో మనవళ్లూ - మనవరాళ్లతో కలిసి సరదాగా గడపాల్సిన వయసులో ఏకంగా అనుమానంతో రగిలిపోయాడు ఓ వృద్ధుడు. భార్య అంత వయసులో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించి కడతేర్చాడు. కాటికి కాలుచాపిన ముదిమివయసులో అనుమానమే పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త ఉదంతం సభ్యసమాజంలో సంచలనమైంది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో చోటుచేసుకుంది.

నేరెళ్ల గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడు బుచ్చయ్యకు భార్యపై ఆదినుంచి అనుమానమే.. ఆమె ఎవరితో మాట్లాడినా.. చెప్పకుండా వెళ్లినా అనుమానంతో హింసించేవాడు.. ఈ విషయంపై కొడుకు - కూతుళ్లకు చెప్పి తల్లి వాపోయేది. అయితే ఆ అనుమానం వయసు పెరిగేకొద్దీ తగ్గకపోగా పెరిగిపోయింది.

భార్యపై అనుమానపు పగను పెంచుకున్న బుచ్చయ్య ఇదివరకే ఆమెను రెండు సార్లు హత్య చేయాలని భావించాడు. ఒక సారి గోతి తవ్వి అందులో కప్పడానికి హత్యాయత్నం చేశాడు. మరోసారి గ్యాస్ లీక్ చేసి చంపాలని చూశాడు. ఈ విషయంపై పంచాయతీలు జరిగి నచ్చచెప్పినా బుచ్చయ్య తీరు మారలేదు.

తాజాగా నిద్రిస్తున్న చిలకమ్మపై కత్తితో దాడి చేసి గొంతుకోసి చంపాడు బుచ్చయ్య. ఈ హత్య తనే చేశానని అందరికీ అనుమానం వస్తుందని కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని కత్తితో చిన్నగా గొంతుకోసుకున్నాడు. కొందరు తన భార్యను చంపి తనపై హత్యాయత్నం చేశారని కుమార్తెలు - గ్రామస్థులకు చెప్పాడు. తండ్రి తీరుపై అనుమానంతో పోలీసులకు విషయం చెప్పారు కుమార్తెలు. పోలీసులు బుచ్చయ్యను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.