Begin typing your search above and press return to search.

పేరుకు రూపాయి.. దేశ ప్ర‌జ‌ల మీద‌ రూ.72వేల కోట్ల భారం!

By:  Tupaki Desk   |   5 July 2019 10:28 AM GMT
పేరుకు రూపాయి.. దేశ ప్ర‌జ‌ల మీద‌ రూ.72వేల కోట్ల భారం!
X
ఎన్నిక‌ల వేళ ఎన్నో వ‌రాలు..హామీలు ఇవ్వ‌టం నేత‌ల‌కు మామూలే. ఓట్లు అడిగే వేళ చెప్పే మాట‌ల‌కు.. అధికారం చేతికి వ‌చ్చిన త‌ర్వాత తీసుకునే నిర్ణ‌యాల‌కు ఏ మాత్రం పోలిక ఉండ‌దు. ఆ విష‌యాన్ని త‌న చేత‌ల‌తో మ‌రోసారి నిరూపించారు ప్ర‌ధాని మోడీ. పార్ల‌మెంటులో తాజాగా బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ త‌న ప్ర‌సంగంలో భాగంగా దేశ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వ‌రాల కంటే కూడా వేసిన వాత‌లే ఎక్కువ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అన్నింటికి మించి ఇప్ప‌టికే పెట్రోల్.. డీజిల్ మీద విధించిన లీట‌రుకు ఒక్క రూపాయి అద‌న‌పు సెస్ భారీ భారంగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికే రోజువారీ స‌మీక్ష పేరుతో రోజుకో నాలుగైదు పైస‌లు చొప్పున పెంచుకుంటూ పోవ‌టం వ‌ల్ల ఇప్ప‌టికే పెద్ద ఎత్తున పెరిగాయి పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌లు. దీనికి తోడు.. కేంద్ర‌..రాష్ట్ర ప్ర‌భుత్వాలు భారీ ఎత్తున విధించిన ప‌న్నులు కూడా చ‌మురు ధ‌ర‌లు భారంగా మారిన ప‌రిస్థితి.

లీట‌రుకు రూపాయి చొప్పున సెస్ విధిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. దేశ ప్ర‌జ‌ల మీద ప‌డిన భారం మొత్తం లెక్క తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. తాజాగా లీట‌రుకు రూపాయి చొప్పున సెస్ విధించిన నేప‌థ్యంలో ప్ర‌తి రోజు రూ.200 కోట్ల మేర రాబ‌డి కేంద్రానికి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. అంటే.. ఏడాదికి దేశం మీద రూ.72వేల కోట్ల వ‌ర‌కు అద‌న‌పు ఆదాయం ల‌భిస్తుంద‌ని భావిస్తున్నారు.

తాజా సెస్ వ‌డ్డింపుతో ర‌వాణా ఛార్జీల మీద మ‌రింత భారం ప‌డ‌టం ఖాయం. నిత్య‌వ‌స‌రాల మీద ధ‌ర‌లు పెరిగే వీలుంది. పేరుకు రూపాయే కానీ మొత్తం సైకిల్ మీద అన్ని విధాలుగా భారం ప‌డ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్పుదు. మోడీని న‌మ్మి ఓటేసిన దేశ ప్ర‌జ‌ల‌కు రూపాయి సెస్ తో భ‌లే గిఫ్ట్ ఇచ్చార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.