Begin typing your search above and press return to search.

ఏడాదిలో రూ.7వేలు పెంచేశారుగా సారూ

By:  Tupaki Desk   |   9 March 2020 5:03 AM GMT
ఏడాదిలో రూ.7వేలు పెంచేశారుగా సారూ
X
క్యాలెండర్ లో ఏడాది మారిన ప్రతిసారీ.. సంపద సంగతి ఎలా ఉన్నా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల తల మీద అప్పు భారం మాత్రం పెరగటం ఖాయం. తాజాగా.. ఆ విషయాన్ని మరింత స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ గణాంకాలు వివరంగా చెప్పేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెరిగిన అప్పు భారం లెక్కలు ఆసక్తికరంగా మారాయి.

మేధావి.. సంక్షేమ పథకాల క్రియేటర్ గా కీర్తిని సొంతం చేసుకునే కేసీఆర్ మాష్టారి పాలనలో తలసరి అప్పు భారం అంతకంతకూ పెరిగిపోతున్న వైనం చూస్తే.. ఈ విషయం మీదా సారు ఎందుకు ఫోకస్ పెట్టరన్న భావన కలుగక మానదు. ఏడాదికేడాదికి ప్రభుత్వం చేస్తున్న అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో తలసరి అప్పు అదే స్థాయిలో పెరుగుతుందన్న విషయాన్ని బడ్జెట్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్ గణాంకాల్ని చూసినప్పుడు పెరిగిన అప్పు లెక్క స్పష్టంగా కనిపిస్తుంది. 2020-21 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పు రూ.2.29లక్షల కోట్లకు చేరినట్లు తేల్చారు. ఈ భారీ అప్పును రాష్ట్రంలోని ప్రజలందరి తలకు లెక్కేస్తే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674. మొత్తం అప్పుతో ఈ జనాభాతో భాగిస్తే వచ్చే అంకె రూ.65,480. వాస్తవ గణాంకాలతో పోలిస్తే ఈ భారం కాస్త తక్కువే ఉండే వీలుంది. ఎందుకంటే.. గడిచిన తొమ్మిదేళ్లలో జనాభా పెరిగి ఉంటుంది కాబట్టి.. భారం తక్కువగా ఉండొచ్చు. కానీ.. గత ఏడాది బడ్జెట్ లెక్కలు.. తలసరి అప్పుతో పోలిస్తే.. ఈ ఏడాది మరింత పెరిగిందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

గత ఏడాది బడ్జెట్ లెక్కల ప్రకారం రూ.58,2020 అయితే.. ఈ ఏడాది తలసరి అప్పు భారం రూ.65,480గా చెప్పాలి. అంటే.. ఏడాదిలో రూ.7,278 మేర పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే.. రాష్ట్ర అప్పు పెరిగిన శాతం ఆందోళనకరంగా కనిపించక మానదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తితో పోల్చినప్పుడు అప్పు భారం అంతకంతకూ పెరుగుతుందని చెప్పాలి. అయితే.. రాష్ట్రం చేస్తున్న అప్పులన్ని నిబందనలకు అనుగుణంగానే అని చెప్పటం చూసినప్పుడు.. ఎంత రూల్ ప్రకారం అయితే మాత్రం.. రోజులు గడిచే కొద్దీ అప్పు భారం పెరగటం దేనికి సంకేతం అన్న వాదన నుంచి ముందుకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తుంది.