Begin typing your search above and press return to search.

ఆ ఆఫ్రికా దేశాన్ని వ‌ణికిస్తున్న ఆ వ్యాధి.. ఇప్ప‌టికే 700 మంది బ‌లి!

By:  Tupaki Desk   |   6 Sep 2022 8:30 AM GMT
ఆ ఆఫ్రికా దేశాన్ని వ‌ణికిస్తున్న ఆ వ్యాధి.. ఇప్ప‌టికే 700 మంది బ‌లి!
X
ఆఫ్రికా ఖండ దేశం జింబాబ్వేను మీజిల్స్ వ్యాధి బెంబేలెత్తిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల 700 మంది చిన్నారులు మరణించారు. ఈ మేర‌కు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మీజిల్స్ (త‌ట్టు వ్యాధి)తో సెప్టెంబర్ 1న ఒక్క రోజే 37 మంది చిన్నారులు మ‌రణించారు. సెప్టెంబర్ 4 నాటికి జింబాబ్వేలో మొత్తం 6,291 కేసులు నమోదైనట్లు గ‌ణాంకాలు తెలుపుతున్నాయి. అయితే రెండు వారాల క్రితం మీజిల్స్ వల్ల 157మంది చిన్నారులు మరణించినట్లు అధికారులు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అయితే ఇంత‌లోనే ఇ‍ప్పుడు ఆ సంఖ్య ఏకంగా నాలుగు రెట్లుకు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.

కాగా మీజిల్స్ (త‌ట్టు వ్యాధి) బాధితుల్లో ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకోని, పోషకాహార లోపం ఉన్న చిన్నారులే ఉంటున్నార‌ని చెబుతున్నారు. మతపరమైన నమ్మకాలతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్లు వేయించ‌క‌పోవ‌డ‌మే ఈ దుస్థితికి కార‌ణ‌మ‌ని నిపుణులు అంటున్నారు.

మీజిల్స్ తో చిన్నారుల మ‌ర‌ణాలు ఎక్కువ కావ‌డంతో వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేసేలా కొత్త చట్టం తీసుకురావాలని జింబాబ్వే యోచిస్తోంది. 6 నెలల నుంచి 15 ఏళ్ల పిల్లలకు పెద్ద ఎత్తున మాస్ వ్యాక్సినేషన్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మత పెద్దలు దీనికి సహకరించాలని విన్న‌విస్తోంది.

కాగా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో మీజిల్స్ కూడా ఒకట‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. గాలి ద్వారా, తుమ్మ‌డం, దగ్గడం వల్ల ఇతరులకు సులభంగా మీజిల్స్ వ్యాపిస్తుంద‌ని అంటున్నారు. ఈ వ్యాధి సోకిన పిల్లలలో దగ్గు, జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటివి ఉంటాయ‌ని పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ తీసుకోని చిన్నారులకు ఈ వ్యాధి సోకితే తీవ్ర అస్వస్థతకు గురై మ‌ర‌ణించే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంద‌ని వైద్య నిపుణులు చెబుతుండ‌టం అంద‌రిలో క‌ల‌వ‌రానికి కార‌ణ‌మ‌వుతోంది.

మ‌రోవైపు మీజిల్స్ (త‌ట్టు వ్యాధి) వ్యాప్తిని నియంత్రించాలంటే 90 శాతం మంది చిన్నారులకు వ్యాక్సిన్లు అందించాలని వైద్య నిపుణులు జింబాబ్వే ప్ర‌భుత్వానికి సూచిస్తున్నారు. కరోనా కారణంగా పేద దేశాలైన ఆఫ్రికా దేశాల‌న్నీ ఆర్థిక మాంద్యం బారిన‌ప‌డ్డాయి. దీంతో మందులు, వ్యాక్సిన్లు కొనుగోలు చేయ‌డం ఆ దేశాల‌కు తీవ్ర ఆర్థిక భారంగా మారింది. దీంతో ఆఫ్రికా ఖండంలోని పేద దేశాల్లో మీజిల్స్ విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గ‌త‌ ఏప్రిల్‌లోనే హెచ్చరికలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5 కోట్ల మంది పిల్లలు సాధారణ వ్యాక్సిన్లు కూడా వేయించుకోలేక‌పోయార‌ని ఐక్య‌రాజ్య‌స‌మితికి చెందిన యూనిసెఫ్‌ జులైలోనే చెప్ప‌డం గ‌మ‌నార్హం. దీనివల్ల చిన్నారుల‌కు ముప్పు పొంచి ఉంద‌ని అప్పుడే హెచ్చరించింది. ఇప్పుడు యునిసెఫ్ హెచ్చ‌రించిన‌ట్టే జ‌రుగుతుండ‌టం విషాద‌క‌రం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.