Begin typing your search above and press return to search.

70 ఏళ్ల యలమందమ్మ..జీవితమే ఓ పోరాటం!

By:  Tupaki Desk   |   13 Jun 2020 8:00 AM IST
70 ఏళ్ల యలమందమ్మ..జీవితమే ఓ పోరాటం!
X
``ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి...ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి...విశ్రమించవద్దు ఏ క్షణం...విస్మరించవద్దు నిర్ణయం...అప్పుడే నీ జయం నిశ్చయంరా....నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన....జీవితాన అడుగు అడుగునా....నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు....బ్రతుకు అంటే నిత్య ఘర్షణ...దేహముంది ప్రాణముంది నెత్తురుంది... సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా...`` `పట్టుదల` సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాట చాలామంది వినే ఉంటారు. ఈ పాట వినగానే చాలామందికి జీవితంపై కొత్త ఆశలు చిగురిస్తాయి...నిరాశలో కూరుకుపోయిన వారికి కొత్త వెలుగు కనిపిస్తుంది...జీవితాన్ని పోరాడి గెలవాలనిపిస్తుంది. అయితే, కొంతమందికి ఈ పాట విన్న కొన్ని రోజుల తర్వాత ఆ పాట ఇచ్చిన కిక్ తగ్గిపోతుంది. ఆ కిక్ తగ్గగానే....ఎవరికి వారు వేసుకునే భూతద్దంలో వారికి మాత్రమే పెద్దదిగా కనిపించే అతి చిన్న సమస్య మెదడును తొలిచేస్తుంది. లేదంటే అప్పటివరకు బద్ధకంగా బలాదూర్ గా గడిపిన కొందరు...తమ జీవితంలో బాధ్యతలు ఒక్కసారిగా మీదపడడంతో తట్టుకోలేరు. వార్షిక పరీక్షలు,ప్రేమ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని బాధపడే వారు మరికొందరు...అనారోగ్యం అని ఇంకొందరు...అటువంటి వారంతా ఏదో ఒక బలహీన క్షణంలో....తమకు తాము విధించుకునే శిక్ష ఆత్మహత్య. సకల రోగ నివారణి జిందా తిలిస్మాత్ అన్నట్లు...అన్ని సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యే అని భావించే కొందరికి యలమందమ్మ(70) జీవితం ఆదర్శం.

మూడు పదుల వయసు దాటినా పనీ పాటా లేకుండా ముప్పొద్దులా తింటూ... అమ్మానాన్నల ఆదాయాల మీద ఆధారపడి అచ్చోసిన ఆంబోతులా గాలికి తిరిగేవారు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారికి గుంటూరు జిల్లాకు చెందిన యల్లమందమ్మ జీవితం ఓ పెదబాలశిక్ష వంటిది. ఒంట్లో సత్తువున్నంత కాలం కాయకష్టం చేసి స్వశక్తిపై జీవించాలనుకునే మనస్తత్వం ఈ బామ్మది. ఏడు పదుల వయసు దాటినా....చేతనైనంత కాలం ఒకరికి భారం కాకూడదని రెక్కల కష్టం మీద బ్రతుకుతోంది. తనను చేరదీసి ఆప్యాయంగా చూసుకునే కొడుకు ఉన్నాకూడా...తన భారం అతడి మీద వేయకూడదనే ఉన్నత వ్యక్తిత్వం ఆమెది. ప్రతిరోజు ఉదయాన్నే సద్ది కట్టుకొని గడ్డి కోసం సైకిలెక్కి 4 కి.మీ ప్రయాణిస్తుంది యలమందమ్మ. ఆ నాలుగు కిలోమీటర్లలో రెండు కిలోమీటర్లు తెనాలి రైలు ట్రాక్‌పై గడ్డి మోపుతో ఉన్న సైకిల్‌ ను తోసుకుంటూ వస్తుంది. ఆ తర్వాత గడ్డిమోపు రూ.100లకు అమ్మి ఇల్లు చేరుకుంటుంది. గత నాలుగేళ్లుగా గడ్డి అమ్మి వచ్చిన డబ్బే యలమందమ్మకు జీవనాధారం. స్వశక్తితో బ్రతుకుతూ ఆత్మ సంతృప్తి తో జీవిస్తోన్న యలమందమ్మ జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం.